టీఆర్‌ఎస్‌ సవాల్‌కు సై: రేవంత్‌రెడ్డి | Balka Suman, Revanth Reddy Open Challenge | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ సవాల్‌కు సై: రేవంత్‌రెడ్డి

Published Wed, Jan 10 2018 8:10 PM | Last Updated on Thu, Jan 11 2018 2:40 AM

Balka Suman, Revanth Reddy Open Challenge - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వ విద్యుత్‌ దుర్మార్గాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమేనని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో టీఆర్‌ఎస్‌ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపారు. ఎంపీ బాల్క సుమన్‌ కోరిన విధంగా బహిరంగ చర్చకు తాను, అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు వస్తామని, చర్చా వేదిక సీఎం అధికార నివాసం ప్రగతి భవన్‌ అయినా లేదా మరెక్కడికైనా వస్తామని తెలిపారు.

ఈ మేరకు రేవంత్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడినా విద్యుత్‌ కొరత ఏర్పడకుండా కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన కొత్త విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణాలు, ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్‌ కొనుగోళ్లు, కొత్త ప్లాంట్ల నిర్మాణాల పేరుతో జరుగుతున్న అక్రమాలు.. అన్నీ బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

విద్యుత్‌ వెలుగుల వెనక చీకటి కోణం
‘రోజంతా విద్యుత్‌’వెలుగుల వెనక చీకటి కోణం దాగి ఉందని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీటి మీద రాతలు రాయడంలో దిట్ట అని, తన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పనిచేయడంలో కేసీఆర్‌ది అందెవేసిన చెయ్యి అని ఆయన విమర్శించారు.

బుధవారం గాంధీ భవన్‌లో రేవంత్‌ విలేకరులతో మాట్లాడుతూ, విద్యుదుత్పత్తి కేంద్రాల్లో సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీని మార్చమని కేంద్రం ఆదేశించినా ఇక్కడ దానిని పాటించడంలేదని అన్నారు. ఈ టెక్నాలజీని అందించే ఇండియా బుల్స్‌ సంస్థ కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకుందని, అందుకే కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినా.. కాలం చెల్లిన టెక్నాలజీని వాడుతున్నారని పేర్కొన్నారు. బీహెచ్‌ఈఎల్‌ ద్వారా ప్రభుత్వం ఇండియా బుల్స్‌కి రూ.2 వేల కోట్లు చెల్లించిందని ఆరోపించారు. ఈ చెల్లింపులోనే కేసీఆర్‌ చీకటి ఒప్పందం దాగి ఉందని అన్నారు.

24 గంటల విద్యుత్‌ కాంగ్రెస్‌కు ఇష్టం లేదు
రేవంత్‌వన్నీ తప్పుడు లెక్కలు: ఎంపీ బాల్క సుమన్‌
సాక్షి, హైదరాబాద్‌:
తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ మండిపడ్డారు. ఈ పథకాన్ని కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతుందన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌తో కలసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ..కరెంటు కష్టాల నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టిందన్నారు. కరెంటుపై రేవంత్‌రెడ్డి చెప్పేవన్నీ తప్పుడు లెక్కలని నిరూపిస్తామని చెప్పారు. తాము చెప్పే లెక్కలు అబద్ధమైతే ప్రజలు వేసే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు.

సవాల్‌కు సిద్ధమేనా?
ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విద్యుత్‌ సంస్థ కాంగ్రెస్‌ నేత సుబ్బరామిరెడ్డికి చెందినదని, ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు ఆయనతో రేవంత్‌ చెప్పించగలరా అని బాల్క సుమన్‌ సవాల్‌ విసిరారు. సీఎం కేసీఆర్‌ కృషితోనే భూపాలపల్లిలో విద్యుత్‌ ఉత్పాదన ప్రారంభమైందన్నారు. రేవంత్‌ చెబుతున్న గుజరాత్‌ కంపెనీ ఎక్కడుందో ఆయనకే తెలియాలన్నారు.

విద్యుత్‌పై బహిరంగ చర్చకు కాంగ్రెస్‌ నేతలు సిద్ధమేనా అని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డితో కలసి వచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. రేవంత్‌ చెప్పేది అబద్ధమైతే అబిడ్స్‌ చౌరాస్తాలో ముక్కు నేలకు రాస్తారా అని సవాలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement