జైపూర్: రాజస్తాన్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎల్పీకి హాజరుకాని తమపై అనర్హతను వేటువేస్తామంటూ స్పీకర్ జారీచేసిన నోటీసులపై సచిన్ పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే.. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై బీజేపీ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్(ఆర్ఎల్‌టీ) పార్టీ విమర్శలు గుప్పించింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ను ఈ గండం నుంచి గట్టెక్కించడానికి వసుంధర రాజే ప్రయత్నిస్తున్నారని ఆర్ఎల్‌టీ ఎంపీ హనుమాన్ బేనీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు వర్గాన్ని దెబ్బతీయడానికి వసుంధర రాజే ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.(సంతోషంగా ఉంది: వసుంధరా రాజే)
ఈ సందర్భంగా హనుమాన్ బేనీవాల్ ‘వసుంధర రాజే తనకు సన్నిహితులైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పిలిచి వారితో మాట్లాడుతున్నారు. అశోక్ గహ్లోత్‌కు మద్దతు ఇవ్వాలని ఆమె ఎమ్మెల్యేలను కోరుతున్నారు. సచిన్ పైలట్‌కు దూరంగా ఉండాలని సికార్, నాగౌర్‌లోని ప్రతి ఒక్క జాట్ ఎమ్మెల్యేకు చెప్పారు. ఇందుకు ఆధారాలున్నాయి’ అని హనుమాన్ బేనీవాల్ ట్వీట్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘గహ్లోత్‌కు వసుంధర రాజే సహకరిస్తున్నట్టు ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితులు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి మేము సహకరించము’ అని అన్నారు. అయితే, వసుంధర రాజేపై హనుమాన్ విమర్శలు గుప్పించడం ఇదే తొలిసారి కాదు. తొలుత బీజేపీలో ఉన్న ఆయన 2018 ఎన్నికల ముందు ఆ పార్టీని వీడారు. (హైకోర్టుకు సచిన్ వర్గం)
హనుమాన్ బేనీవాల్ విమర్శలపై రాజస్తాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా స్పందిస్తూ.. వసుంధర రాజేపై ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. ఆమెతో అధిష్ఠానం మాట్లాడుతుందని, ఆమె తమ గౌరవ నేతని అన్నారు. ఇదిలా ఉండగా.. రాజస్తాన్ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభంపై వసుంధర రాజే ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మధ్యప్రదేశ్ తరహాలో సచిన్ పైలట్ తిరుగుబాటుకు బీజేపీ మద్దతు ఇస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో వసుంధర రాజే మౌనంగా ఉన్నారు. ఇది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని బీజేపీ కూడా ఆచితూచి స్పందిస్తోంది. (పైలట్ మనవాడైతే విమానం హైజాక్ ఎందుకు?)
Comments
Please login to add a commentAdd a comment