
అమేథి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తన సొంత నియోజకవర్గం అమేథిలో ఊహించని పరిణామం ఎదురైంది. ప్రధాన మంత్రి సడక్ యోజన ద్వారా రూ. 3.5 కోట్లతో తావూరి, కొట్వా గ్రామాల మధ్య 5.5 కిలోమీటర్ల దూరం గల రోడ్డును ప్రారంభించడానికి రాహుల్ సిద్దమైన నేపథ్యంలో స్థానిక బీజేపీ నేతలు ఆయన పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. రోడ్డును రాహుల్ ప్రారంభించడానికి వీల్లేదని, ఆయన వస్తే అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, రాహుల్ ఎలా ప్రారంభిస్తారని స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు.
రోడ్డును ప్రారంభించి రాహుల్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉమా శంకర్ పాండే విమర్శించారు. కాగా రోడ్డు పనులు పూర్తికాకముందే రాహుల్ ఎలా ప్రారంభిస్తారని, పూర్తయ్యే వరకు వేచి ఉండాలని సీడీఎం అభయ్ పాండే తెలిపారు. కాగా దీనిపై స్పందించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు యోగేంద్ర మిశ్రా.. ఇది ప్రారంభోత్సవం కాదని కేవలం పనులను పర్యవేక్షించం కోసమే రెండు రోజులు పర్యటనలో భాగంగా రాహుల్ వస్తున్నారని తెలిపారు.