భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా నాలుగోసారి అధికారం కైవసం చేసుకోవాలని అధికార బీజేపీ చూస్తోంది. అయితే, ఆగస్టు నెలలో విడుదలైన పలు నివేదికల్లో ఈసారి బీజేపీపై రాష్ట్రంలో ప్రతికూల పవనాలు వీయనున్నాయని వెల్లడైంది. దీంతో అప్రమత్తమైన కమల దళ నాయకులు అధికారం చేజారిపోకుండా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, మఠాలు, హిందూ మత గురువుల జాబితాను రూపొందించే పనిలో మునిగారని పలువురు భావిస్తున్నారు.
కాగా, జాబితా రూపకల్పనపై ఆ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రజనీష్ అగర్వాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దేవాలయాలు, హిందూ మత గురువుల సమాచారం సేకరించిన మాట వాస్తవమేనని అన్నారు. అయితే, సేకరించిన డాటాతో ఏం చేయబోతున్నారని మాత్రం చెప్పలేదు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు, నాయకుల వివరాలు సేకరించడంలో వింతేముందని అన్నారు. బూత్ స్థాయిలో కేడర్‌ను పటిష్టం చేయడం కోసం డాటా సేకరించి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌తో పాటు, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరాంలలో కూడా డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment