లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఆజంఖాన్ పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ రమాదేవిపై చేసిన వ్యాఖ్యలపై పెనుదుమారం చెలరేగుతోంది. ఆయన వ్యాఖ్యలను బీజేపీ నేతలంతా ఖండించగా.. ఆ పార్టీ యూపీ నేత ఒకరు మరింత ఘాటుగా స్పందించారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ఆఫ్తాబ్ అద్వానీ అజంఖాన్‌పై వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేశారు. మహిళా ఎంపీని అవమాన పరుస్తూ అసభ్యంగా మాట్లాడినందుకు ఆజంఖాన్ తల నరికి పార్లమెంటు తలుపునకు వేలాడదీయాలని ఆఫ్తాబ్ డిమాండ్ చేశారు. ‘‘ఆజంఖాన్ గతంలో కూడా జయప్రదపై అసభ్య వ్యాఖ్యలు చేశారు. మళ్లీ మహిళా ఎంపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆజంఖాన్ నిజంగా పిచ్చివాడు. పిచ్చి కుక్కలా అశ్లీల వ్యాఖ్యలు చేస్తున్న ఇలాంటి నాయకులు దేశానికి హానికరం...అందుకే ఇతన్ని చంపండి’’ అంటూ ఆఫ్తాబ్ వీడియోలో కోరారు.
దేశ మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్న ఆయనపై ప్రతికారం తీర్చుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఆజంఖాన్ సభ్వత్వాన్ని రద్దు చేయాలని పలువురు బీజేపీ మహిళా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కాగా దీనిపై స్పందించిన ఆయన.. తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. చేయని తప్పుకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్న ఆజంఖాన్ తాను అన్‌పార్లమెంటరీ పదాలు ఏమైనా వాడితే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment