సాక్షి, సంగారెడ్డి : ఆర్టీసీ కార్మికుల కాళ్లకు ముల్లు గుచ్చితే పంటితో తీస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదని బీజేపీ నేత రఘునందన్ రావు విమర్శించారు. సంగారెడ్డిలో శనివారం జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు రఘునందన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీధర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. కార్మికులను డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం బెదిరించడం దారుణం అన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో రాయితో కొడితే.. మనం ఇటుకతో కొడదామన్న కేసీఆర్ ఇప్పుడు చేస్తుందేమిటి అని ప్రశ్నించారు. ‘కార్మికులు ఏమైనా మీ ఫాం హౌజ్‌లో వాటా అడిగారా సీఎం. తండ్రేమో జీహెచ్‌ఎమ్‌సీ నుంచి నిధులిస్తామంటే.. కొడుకు కేటీఆర్ మాత్రం నిధుల కేటాయింపు సాధ్యం కాదంటాడు. తండ్రీ కొడుకులు కలిసి నాటకాలు ఆడుతున్నారు’ అంటూ మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు 45 రోజులకు ముందే నొటీసులిచ్చి సమ్మెకు వెళ్లారని పేర్కొన్నారు.
ఐఏస్ అధికారి సోమేశ్ కుమార్ కార్మికులు వినకుంటే తొలగిస్తామని బెదిరిస్తున్నారని, ఇప్పటి వరకూ పోలీసు కానీస్టేబుల్ ఉద్యోగాలు తప్ప మరే ఉద్యోగాల భర్తీ జరగలేదని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ పిరికిపందల సంఘం ఆధ్యక్షుడని ఎద్దేవా చేశారు. సకల జనుల సమ్మెతో సమైక్యాంధ్రులను వణికించిన చరిత్ర ఆర్టీసీ కార్మికులదని అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత బాగుపడింది ఆంధ్రా కాంట్రాక్టర్లని, మీకు మేము అండగా ఉంటాం.. ఎవరు భయపడవద్దని రఘునందన్ భరోసా ఇచ్చారు.
చదవండి : లైవ్ అప్‌డేట్స్: నిలిచిన బస్సులు.. ప్రయాణికుల కష్టాలు
Comments
Please login to add a commentAdd a comment