సాక్షి, అమరావతి : ప్యాకేజీకి రైట్ రైట్ అన్న చంద్రబాబు.. తర్వాత యూటర్న్ తీసుకున్నారని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సుదీశ్ రాంభొట్ల అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రధాని మోదీ సభ విజయవంతం కావడంతో ఏం చేయాలో పాలుపోక చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఖర్చుతో ఢిల్లీ దీక్ష కోసం రైల్వే శాఖకు జీవో విడుదల చేశారన్నారు. దీక్షలో పాల్గొనే తమ నాయకుల కోసం సిగ్గు లేకుండా ఏసీ హోటళ్లు బుక్ చేశారని మండిపడ్డారు. బాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది వికృత రాజకీయ విన్యాస క్రీడ అని, కొత్త బూచిని చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుజనా చౌదరి, చంద్రబాబు అదే మేలు అన్నారు
ప్యాకేజీకి ఒప్పుకొన్న చంద్రబాబు ప్రస్తుతం హోదా రాగం పాడుతున్నారని సుదీశ్ రాంభొట్ల ఎద్దేవా చేశారు. ‘అప్పుడు నీతి ఆయోగ్ లో 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు. ఈశాన్య రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని అదనపు బెనిఫిట్ ఇవ్వాలని ఆగష్టు 2016లో నీతి ఆయోగ్ చెప్పింది. ఆ సమయంలో ప్యాకేజీ మేలు అని సీఎం చంద్రబాబు, సుజనా చౌదరి అన్నారు. పైగా ప్యాకేజీకి మించింది ఏముంటుంది అన్నారు. ప్యాకేజీ చట్టబద్దత కోసం కృషి చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. మాతో కలిసి ఉన్నపుడు ఇలా ఎన్నో ప్రకటనలు చేశారు. మాతో కలిసి ఉన్నప్పుడు మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పుడు కొత్తరాగం అందుకున్నారు’అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment