
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సొమ్ముని దోచి ఇక్కడ గాంధీ భవన్ సాక్షిగా ఖర్చు పెడుతున్నారని..
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీడియాలో చిల్లర ప్రచారం చేస్తున్నాడని, ఎన్నికల కమిషన్ ఆయనపై చర్యలు తీసుకోవాలని.. వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లగడపాటి డ్రామా సర్వేలను ఎవరూ నమ్మరని అన్నారు. తెలుగుదేశం నాటకంలో సూత్రధారి, పాత్రధారి లగడపాటేనన్నారు. ఆయన గెలిస్తే సమైకాంధ్ర ఉద్యమం తీసుకొస్తామని టీడీపీ నేతలు బాహాటంగా చెబుతున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సొమ్ముని దోచి ఇక్కడ గాంధీ భవన్ సాక్షిగా ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. మహాకూటమి నేతలకు సంబంధించిన కోట్ల రూపాయలు పట్టు పడుతున్నాయని తెలిపారు. రెండు రాష్ట్రాలను కూటమి నేతలు ఒకటి ఎలా చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి పేరుతో దొంగలు అందరూ కలిశారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించబోతోందని, తెలంగాణలో బీజేపీ కీలక భూమిక పోషించబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.