బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల జాబితా నుంచి తాజాగా జార్ఖండ్ కూడా జారిపోయింది. 2017లో దేశ భూభాగంలోని 71%లో బీజేపీ ఆధికారంలో ఉంది. ఇప్పుడు 2019 డిసెంబర్ నాటికి అది 35 శాతానికి తగ్గిపోయింది. జనాభా విషయానికి వస్తే నాడు 69% జనాభా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉండగా, అదిప్పుడు 43 శాతానికి తగ్గింది. ఈ సంవత్సరం ఏప్రిల్– మే నెలల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన అనంతరం జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. త్వరలో ఢిల్లీ, బిహార్‌లలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి పరంపర 2018 నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ల్లో ఓటమి నుంచి ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల్లో పట్టున్న సామాజిక వర్గాల నుంచి కాకుండా వేరే వర్గాల నేతలను ప్రోత్సహించే విధానాన్ని బీజేపీ వదలాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హరియాణాలో జాట్, మహారాష్ట్రలో మరాఠా, జార్ఖండ్‌లో గిరిజనులు బీజేపీకి వ్యతిరేకంగా నిలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హరియాణా, మహారాష్ట్రల్లో అతి పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో పోలిస్తే.. తక్కువ సీట్లనే గెలుచుకుంది.
హరియాణాలో జననాయక్ జనతా పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. మహారాష్ట్రలో మిత్ర పక్షం శివసేనతో విభేదాల కారణంగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కోల్పోయింది. తాజాగా, జార్ఖండ్‌లో అధికారాన్ని కోల్పోయింది. లోక్‌సభ ఎన్నికల తరువాత జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం కూడా.. లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతంతో పోలిస్తే బాగా తగ్గింది. లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లో బీజేపీ ఓటు శాతం 55 కాగా, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అది 33 శాతానికి తగ్గింది. హరియాణాలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటుశాతం 58 కాగా, అది శాసనసభ ఎన్నికల నాటికి 36 శాతానికి తగ్గింది. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాఖ్, అయోధ్యలో రామ మందిరం.. తదితర సైద్ధాంతిక హామీలను నెరవేర్చినప్పటికీ.. ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment