
భోపాల్: బీజేపీ ఎంపీ ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ కాంగ్రెస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పాలనలో దారుణంగా హింసించడంతో తన కంటిచూపు పోయిందని అన్నారు. ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని చెప్పారు. రాష్ట్ర బీజేపీ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 2008 మాలెగావ్ పేలుడు కేసులో అరెస్టైన ఆమె జైలు జీవితాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
(చదవండి: మోదీ సర్కార్‌పై కమల్ ఫైర్)
‘కాంగ్రెస్ తొమ్మిదేళ్ల పాలనలో నాకు ఎన్నో గాయాలయ్యాయి. అవి అప్పుడప్పుడు తిరగబెడతాయి. కంటి రెటీనా నుంచి మెదడు వరకు వాపు చీము రావడంతో చూపు పోయింది. నా కుడి కన్ను అస్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఎడమ కన్నుతో ఏదీ చూడలేను’అని అన్నారు. ఇక భోపాల్‌లో ఎంపీ ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ కనిపించడం లేదన్న పోస్టర్ల గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆమె జవాబిస్తూ.. ఢిల్లీ వెళ్లిన తాను లాక్‌డౌన్ కారణంగా భోపాల్ రాలేకపోయానని అన్నారు.
కాగా, ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ ఆరోపణల్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీసీ శర్మ తోసిపుచ్చారు. కాంగ్రెస్ మహిళలపట్ల గౌరవంగా ఉంటుందని అన్నారు. మధ్యప్రదేశ్‌లో 15 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉండగా.. కాంగ్రెస్ ఆమెను ఎలా హింసించగలదని ప్రశ్నించారు. ఆమె ఆరోపణలు గందరగోళాన్ని సృష్టించేలా ఉన్నాయని అన్నారు. లాక్‌డౌన్ ప్రారంభమైనప్పుడు ఠాకూర్ భోపాల్‌లోనే ఉన్నారని చెప్పారు.
(కరోనా పోరు: కేంద్రం మరో కీలక నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment