సాక్షి,న్యూఢిల్లీ: నోట్ల రద్దు, జీఎస్‌టీకి సంబంధించి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై తీవ్ర విమర్శలు గుప్పించిన పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాపై బీజేపీ క్రమశిక్షణ చర్యలకు దిగకపోవచ్చని భావిస్తున్నారు. సిన్హా ఎవరినీ ఉద్దేశించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకపోవడం, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా గళం విప్పకపోవడంతో ఆయనపై వేటు వేసే అవకాశం లేదని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. యశ్వంత్ వ్యాఖ్యలను పార్టీ నేతలు ఖండించినప్పటికీ వివాదానికి తెరదించాలనే ప్రయత్నం కనిపిస్తోంది. మరోవైపు యశ్వంత్ కేవలం ఆర్థిక వ్యవస్థపైనే మాట్లాడిన క్రమంలో ఆయనపై చర్యలు తీసుకుంటే పార్టీకి చెడ్డపేరు వస్తుందని ఓ బీజేపీ సీనియర్ నేత పేర్కొనడం గమనార్హం. గతంలో 2012 నవంబర్‌లో అప్పటి బీజేపీ చీఫ్ నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలని సిన్హా పట్టుబట్టారు. గడ్కరీకి సంబంధించిన ఓ కంపెనీ ఆర్థిక అవకతవకల నేపథ్యంలో ఆయన ఈ డిమాండ్ చేశారు. ఇక యూపీఏ హయాంలో జీఎస్‌టీని త్వరగా ప్రవేశపెట్టాలని యశ్వంత్ కోరగా, పార్టీ ఆయన వాదనతో విభేదించింది.
పార్టీ సిద్ధాంతాలు, విధానాలతో మాత్రం యశ్వంత్ విభేదించకపోవడంతో ఆయనపై వేటు పడే అవకాశాలు లేవని బీజేపీ నేతలు కొందరు చెబుతున్నారు. గతంలో ఆర్థిక మంత్రిపై వ్యక్తిగత ఆరోపణలు చేసినందుకు పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్‌ను సస్పెండ్ చేశారని, పాకిస్తాన్ ఫౌండర్ మహ్మద్ అలీ జిన్నాను పొగిడినందుకు జస్వంత్ సింగ్‌పై కొద్దికాలం వేటు వేశారని, యశ్వంత్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదని గుర్తుచేస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా, అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన అనంతరం పార్టీ నేతలు పలు అంశాలపై తరచూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం అనంతరం ఆర్‌కే సింగ్, భోళా సింగ్, సీపీ ఠాకూర్ వంటి పార్టీ ఎంపీలు పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఇక బీహార్ ఎంపీ శత్రుఘ్న సిన్హా బాహాటంగానే యశ్వంత్ వ్యాఖ్యలను సమర్ధించారు.మరోవైపు యశ్వంత్ సిన్హా తన దూకుడు వైఖరి నుంచి ఏమాత్రం తగ్గలేదు. ప్రభుత్వానికి బాసటగా నిలిచిన తన కుమారుడు జయంత్ సిన్హాను ఆయన విడిచిపెట్టలేదు. జయంత్ అంత పనిమంతుడైతే ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అతడిని ఎందుకు తప్పించారని ప్రభుత్వాన్ని నిలదీశారు.