‘2023లో అధికారంలోకి వచ్చేది మేమే’ | BJP Will Sweep Telangana In 2023 Election JP Nadda Says In Hyderabad Public Meeting | Sakshi
Sakshi News home page

అధికారంలోకి వస్తాం.. రూపురేఖలు మారుస్తాం: జేపీ నడ్డా

Published Mon, Aug 19 2019 1:45 AM | Last Updated on Mon, Aug 19 2019 8:34 AM

BJP Will Sweep Telangana In 2023 Election JP Nadda Says In Hyderabad Public Meeting - Sakshi

జేపీ నడ్డాకు గజమాలతో సత్కారం. చిత్రంలో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో అందరి సహకారంతో 2023లో అధికారంలోకి వస్తామని, తెలంగాణ రూపురేఖలు మారుస్తామని బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా ధీమా వ్యక్తంచేశారు. ఇప్పటికి 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని, అప్పటికి 25 రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామని, అందులో తెలంగాణ ఉంటుందని స్పష్టంచేశారు. ఎంపీ గరికపాటి మోహనరావు నేతృత్వంలో టీటీడీపీ రాష్ట్ర నేతలు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు ఆదివారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ‘నెక్ట్స్‌ తెలంగాణ’పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో నడ్డా పాల్గొన్నారు. ‘‘నేను బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయ్యాక మొదటిసారిగా తెలంగాణకు రావడం సంతోషంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం మా పార్టీపై ఉంటుందనే విశ్వాసం ఉంది’’అని తెలుగులో ప్రసంగం ప్రారంభించిన నడ్డా.. తర్వాత హిందీలో కొనసాగించారు. బాసర, యాదగిరిగుట్ట వంటి పుణ్యక్షేత్రాలు, బమ్మెర పోతన వంటి కవులు, కొమురం భీం, సమ్మక్క సారలమ్మ వంటి పోరాట యోధులు నడయాడిన గడ్డ, రజాకార్లపై పోరాడిన వీరభూమికి వచ్చినందుకు ఆనందంగా ఉందని, ఈ సమయంలో తెలంగాణకు విముక్తి కల్పించిన వల్లభాయ్‌ పటేల్‌ను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి తెలంగాణలో కేసీఆర్‌ నిరంకుశ, కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. 

అంతా కేసీఆర్‌ ఇష్టమే.. 
సెక్రటేరియట్‌కెళ్లని సీఎం కేసీఆర్‌ ఒక్కరేనని, ఇంతవరకు ఎవరినీ అలా చూడలేదని, అలాంటి సీఎంకు కొత్త సెక్రటేరియట్‌ ఎందుకుని నడ్డా ప్రశ్నించారు. వాస్తు సరిగా లేదని సెక్రటేరియట్‌ భవనాన్ని కూల్చుతారా అని నిలదీశా>రు. 2023లో వాస్తు సరి అవుతుందని, సీఎం కేసీఆర్‌కు వాస్తు అంటే ఏమిటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల నిధులను దారి మళ్లించడమే కాకుండా రాష్ట్ర పథకాలను కూడా సక్రమంగా అమలు చేయడంలేదని విమర్శించారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ కీర్తించిందని, ఈ పథకాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తామని ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ చెప్పినట్టు వెల్లడించారు. అలాంటి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని కోరితే పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. కేవలం ప్రధాని మోదీకి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే పక్కనపెట్టారని ఆరోపించారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 24 లక్షల మంది అర్హులు కేసీఆర్‌కు అక్కర్లేదట అని విమర్శించారు. ఆయనకు కావాల్సిందల్లా రాజకీయాలు, కుటుంబమేనని.. ఇక్కడ ఆయనే చక్రవర్తి (శెహన్‌షా), అంతా ఆయన ఇష్టమేనని దుయ్యబట్టారు. పోనీ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేస్తున్నారా? అంటే అదీ లేదన్నారు. రూ.1500 కోట్ల బకాయిల కారణంగా ఆస్పత్రులు సమ్మె చేస్తున్నా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఇదేనా కేసీఆర్‌ ప్రజల ఆరోగ్యం చూపిస్తున్న శ్రద్ధ అని ప్రశ్నించారు. తమకు ఇవ్వాలని ఉన్నా ఆయనకు తీసుకోవాలని లేదని నడ్డా వ్యాఖ్యానించారు.
 
కాళేశ్వరం పేరు అపవిత్రం చేశారు.. 
కేసీఆర్‌ మీద తాను వ్యక్తిగత ఆరోపణలు చేయదలుచుకోలేదని, కానీ కుడిచేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకోవడం కేసీఆర్‌ నైజమని నడ్డా విమర్శించారు. కేసీఆర్‌ చెప్పేదొకటి.. చేసేదొకటని దుయ్యబట్టారు. ‘‘దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని తానే పీఠం ఎక్కారు. కేబినెట్‌లో ఎస్టీకి, మహిళలకు చోటు కల్పించలేదు. కాళేశ్వరం వంటి మంచి పేరును అపవిత్రం చేశారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథను మిషన్‌ ఫర్‌ కమిషన్‌గా మార్చేశారు. రూ.30వేల కోట్లతో నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.లక్ష కోట్లకు పెంచారు. ప్రాజెక్టుకు పవిత్రమైన పేరు పెట్టి కోట్లు దోచుకుంటున్నారు. భగీరథుడు దివి నుంచి గంగను భువికి తీసుకొస్తే ఆ పేరు పెట్టిన కేసీఆర్‌ మాత్రం ఇంటికి నీళ్లు ఇవ్వలేకపోయారు’’అని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నడ్డా తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు క్షేత్ర స్థాయికి చేరడంలేదని, దారి మళ్లుతున్నాయని ఆరోపించారు. 

బీజేపీలో వారసత్వ రాజకీయాలుండవు.. 
వారసత్వ రాజకీయాలకు బీజేపీ దూరమని నడ్డా స్పష్టంచేశారు. కొడుకు కోసం.. కూతురు కోసం అనేది ఉండదని పేర్కొన్నారు. సాధారణ కార్యకర్త నుంచి మోదీ ప్రధాని అయ్యారని, అమిత్‌షా పార్టీ అధ్యక్షుడు అయ్యారని వివరించారు. కానీ దేశంలో అన్ని పార్టీల్లో కుటుంబ రాజకీయాలే కొనసాగుతున్నాయన్నారు. కేసీఆర్‌ కూడా అలాంటి పాలనే కొనసాగిస్తున్నారని విమర్శించారు. బీజేపీలో మాత్రమే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పార్టీలో చేరినవారందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని వెల్లడించారు. బీజేపీలోకి వలసలు చూసి టీఆర్‌ఎస్‌ కడుపు మండుతోందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని, అందుకే6 పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు సైతం బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. అడగ్గానే తెలంగాణకు ఎయిమ్స్‌ మంజూరు చేశామని.. తెలంగాణపై బీజేపీ అభిమానం ఏమిటో ఎయిమ్స్‌ చెబుతుందని వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు.. 
కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని నడ్డా విమర్శించారు. ఆర్టికల్‌ 370 మంచిదే అయితే దాన్ని ఎందుకు శాశ్వతం చేయలేదని ప్రవ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే దానిని వాడుకుందని ఆరోపించారు. కశ్మీర్‌వాసులు భారత్‌లో స్వేచ్ఛగా జీవించవచ్చని, ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, కానీ భారత ప్రజలు అక్కడ కనీసం పౌరసత్వం కూడా పొందలేరని వివరించారు. అక్కడి ప్రజలకు శాంతి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం బీజేపీ విధానమని.. అందుకే అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లో ఆర్టికల్‌ 370 రద్దు చేశామని తెలిపారు. ట్రిపుల్‌ తలాక్‌ రద్దుతో చారిత్రక తప్పిదాన్ని సరిచేశామని పేర్కొన్నారు. భారత్‌ త్వరలోనే 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా అవతరిస్తుందన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీరు అందిస్తామని వెల్లడించారు. ప్రధాని ఆవాస్‌ యోజనతో ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని, ప్రతి స్వయం సహాయక బృందానికి రూ.5 లక్షల వరకు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. సెప్టెంబర్‌లో లక్ష పోలింగ్‌ బూత్‌లలో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగనున్నాయని, దాంతో బీజేపీ సభ్యత్వం 17 కోట్లకు చేరుకుంటుందని నడ్డా వివరించారు. 

విమానాశ్రయంలో ఘనస్వాగతం 
అంతకుముందు జేపీ నడ్డాకు ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఉదయం నగరానికి వచ్చిన ఆయనకు శంషాబాద్‌ విమానాశ్రయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీగా ఆయన బీజేపీ కార్యాలయానికి వెళ్లారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement