
సాక్షిప్రతినిధి, విజయనగరం: గత ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ కనుసన్నల్లోనే విద్యుత్ ఒప్పందాలు జరిగాయని, వాటిలో కూడా అవినీతి జరిగిందని, అవన్నీ లెక్క తేలుస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో విద్యుత్ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందన్నారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారన్నారు.
చంద్రబాబు నివసిస్తున్న భవనం సీఆర్‌డీఏ పరిధిలో లేదని చెప్పడానికి యనమల ఎవరని ప్రశ్నించారు. చంద్రబాబు నివాసానికే కాకుండా అక్రమ కట్టడాలన్నింటికీ నోటీసులు ఇచ్చామని, జగన్ ప్రభుత్వంలో అవినీతికి, కక్ష సాధింపు చర్యలకు తావులేదన్నారు. చంద్రబాబు నివాసం అక్రమ కట్టడం కాదని నిరూపించగలరా అని సవాల్ విసిరారు. ముందుగానే ఖాళీ చేస్తే ఆయనకే మంచిదన్నారు.
చంద్రబాబు వల్ల రూ. వేల కోట్ల నష్టం
లోకేష్ ట్విట్టర్ రాతల్లో పసలేదని బొత్స అన్నారు. విద్యుత్ ఒప్పందాలు ఎలా జరిగాయో ఆయన తన తండ్రినే అడగాలన్నారు. బాబు హయాంలో విద్యుత్ చార్జీలు పెరిగిపోయి బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిగిన విషయం తెలుసుకోవాలన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఒక్క పైసా కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. అనవసర విద్యుత్ ఒప్పందాలతో చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వానికి రూ. వేల కోట్ల నష్టాన్ని తీసుకొచ్చారని, విద్యుత్ చార్జీలు కూడా పెంచారన్నారు.
తాత్కాలిక అసెంబ్లీ భవనానికి రూ.600 కోట్లు ఖర్చు చేశారని, చదరపు అడుగుకి రూ.10 వేలు ఖర్చు చేయడం దోపిడీ కాదా అని ప్రశ్నించారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తన నామినేషన్ అఫిడవిట్‌లో తన భూములకు సంబంధించి వివాదాలు ఉన్నాయన్నారని ఆ వివాదాలేమిటో బయటకు తీయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంపై తాము సుముఖంగా ఉన్నామని, అయితే పాత టెండరింగ్ విధానాన్ని ఒకసారి సమీక్షించాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment