సాక్షి, విజయవాడ: చంద్రబాబు అరెస్ట్ బీజేపీ వాళ్లకు తెలిసే జరిగిందంటూ ఆరోపించిన టీడీపీ వాళ్లు.. తాజాగా అమిత్‌షాతో నారా లోకేష్ భేటీని ఎలా చూస్తారని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిలదీశారు. ఈ పరిణామంపై స్పందనతో పాటు విశాఖ రాజధానికి సీఎం తరలివెళ్లడంపైనా యెల్లో మీడియా కథనాల్ని విజయవాడలో ఖండించారాయన.
ఢిల్లీలో తాజా పరిణామంపై బొత్సకు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సమాధానంగా.. ‘‘ చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో నాకేం తెలుసు?.. తల్లి, కొడుకులు కలిసి వెళ్లి అమిత్ షాని కలిసి బాధలు చెప్పుకున్నట్లు ఉన్నారు. మా మీద చాడీలు చెప్పి, సానుభూతి పొందడానికి ప్రయత్నించి ఉంటారు. లోకేష్ మాపై చాడీలు చెప్పకుండా.. సీఎం జగన్ మమ్మల్ని బాగా ప్రేమిస్తున్నాడు అని చెప్తాడా ఏంటి?’’ అని వ్యంగ్యం ప్రదర్శించారు.
దొంగ ఎక్కువకాలం దొర లాగా ఉండలేరు. దొంగలు ఎప్పటికైనా దొరక్క తప్పదు. సుజనా చౌదరి వాళ్ళు బీజేపీ బీటీమ్. టీడీపీ వాళ్లే కదా..నిన్నటి వరకు బీజేపీ కి తెలిసే అరెస్ట్ చేసారని చెప్పారు. మరి ఇప్పుడెందుకు ఢిల్లీ వెళ్లి కలిశారు?. లోకేష్ వెళ్లినప్పుడు.. పురందేశ్వరి అక్కడున్నారంటూ టీడీపీ వాళ్లు చెబుతున్నారు. మరి ఆ సమావేశంలో ఏం జరగిందో ఆమెనే చెప్పాలి అని బొత్స అన్నారు.
యెల్లో మీడియా కథనంపై..
దొడ్డిదారిన ఉత్తరాంధ్రలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు జీవో ఇచ్చారంటూ టీడీపీ అనుకూల మీడియా కథనం ప్రచురించింది. దీనిపైనా బొత్స స్పందించారు. ఓపెన్ గా జీవో ఇస్తే..దొడ్డిదారి అని పత్రికలు రాయడం హాస్యాస్పదం. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం కాబట్టి అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చెయ్యాలని జీవో ఇచ్చారు. రాయలసీమ రీజియన్ లో కడపలో సీఎం కి నివాసం ఉంది కదా?. ఈ ఉగాది కి తెలుగుదేశం పార్టీ, సెలబ్రిటీ పార్టీలు ఉండవు. ఎందుకంటే.. అప్పటికి ఎన్నికలొస్తాయి. ఓటమి పాలై కథ క్లోజ్ అవుతుంది? అని బొత్స పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment