అధికారపక్షాన్ని ప్రశ్నించకపోవడమే పవన్‌ ట్రెండా?  | Botsa Satyanarayana Fires on Pawan Kalyan | Sakshi
Sakshi News home page

అధికారపక్షాన్ని ప్రశ్నించకపోవడమే పవన్‌ ట్రెండా? 

Published Sun, Mar 24 2019 5:18 AM | Last Updated on Sun, Mar 24 2019 8:43 AM

Botsa Satyanarayana Fires on Pawan Kalyan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం చంద్రబాబు ఒకవైపు కులవిద్వేషాలు, ప్రాంతీయ విభేదాలు సృష్టించేలా ఎన్నికల సభల్లో మాట్లాడుతూంటే.. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ బహిరంగసభల్లో మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. వీరిద్దరూ రాజకీయ లబ్ధికోసం చెప్పిన విషయాల్నే పదేపదే చెబుతున్నారన్నారు. జనసేన రాజకీయాల్లోకి కొత్త ట్రెండ్‌ను పాటిస్తోందని, ప్రతిపక్షంగా ఉంటూ అధికారపక్షాన్ని పల్లెత్తుమాట అనట్లేదని దుయ్యబట్టారు. అధికారపక్షంతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని కువిమర్శలు చేస్తోందన్నారు. ప్రజల పక్షాన ఉండాల్సిన పవన్‌.. టీడీపీకి అండగా ఉన్నారని ధ్వజమెత్తారు. బొత్స శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భీమవరం సభలో పవన్‌ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆంధ్ర ప్రజల భూములను లాక్కుంటున్నారని చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.

పవన్‌ ఒక ఊసరవెల్లిగా మాట్లాడుతున్నారని, పూటకోమాట మాట్లాడుతూ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల తరువాత కేసీఆర్‌ను పవన్‌ అభినందించారని, ప్రజల హృదయాల్ని దోచుకున్న వ్యక్తిగా ప్రస్తుతించారని, ఇప్పుడదే నోటితో ఆంధ్రాలో కేసీఆర్‌ను విమర్శిస్తూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పవన్‌ సోదరుడు నాగబాబు కూడా కేసీఆర్‌ను గతంలో పొగిడారన్నారు. ‘తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించింది. నేను టీఆర్‌ఎస్‌కు ఓటేశాను. నా ఓటుకు విలువ పెరిగిందని భావిస్తున్నా.. ప్రజల మద్దతుతో గెలిచినందుకు కంగ్రాట్స్‌...’ అంటూ కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులను నాగబాబు అభినందించిన పోస్టింగ్‌లను బొత్స చదివి వినిపించారు. వీరందరినీ ఘనంగా పొగిడిన తన సోదరుడు నాగబాబు సమక్షంలోనే పవన్‌ కేసీఆర్‌పై దుమ్మెత్తి పోయడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌–టీఆర్‌ఎస్‌ కుమ్మక్కు కావడమేంటి? ఆనాడు టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కు అయింది మీరు కాదా? అని నిలదీశారు. టీఆర్‌ఎస్‌తో తమకెలాంటి సంబంధం లేదని, ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టే వారిపట్ల తాము చాలా అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు.

వివేకా హత్యపై ప్రభుత్వాన్ని ప్రశ్నించవేం!
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై అధికారంలో ఉన్న టీడీపీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని చంద్రబాబును ప్రశ్నించకుండా పవన్‌ ప్రతిపక్షాన్ని విమర్శించడమేంటని బొత్స ఆశ్చర్యం వెలిబుచ్చారు. హత్యకు బాధ్యులైనవారిని అదుపులోకి తీసుకుని కఠినచర్యలు తీసుకోవాలని చెప్పడం మానేసి ప్రతిపక్షాన్ని ప్రశ్నించడం దేనికని, ఈ విషయాన్ని ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాలని కోరారు. చంద్రబాబు సీఎంగా పనిచేయడానికి దోహదపడింది పవన్‌ అని, మరి ఈ ఐదేళ్లలో చంద్రబాబు ప్రజాసమస్యల పరిష్కారంలో విజయం సాధించారా? లేక విఫలమయ్యారా? ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారా? ఏపీలో శాంతిభద్రతలు సవ్యంగా ఉన్నాయా? నీతినిజాయితీలతో ప్రజలకు పాలన అందించారా? అన్న విషయాల్ని ప్రజలు బేరీజు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షంగా ఉన్నానని చెప్పుకుంటున్న జనసేన బాధ్యతతో ప్రజల తరఫున మాట్లాడాలని, తప్పు చేసిన ప్రభుత్వాన్ని నిలదీయాలని, ఆ ధైర్యం, పౌరుషం నీకుందా పవన్‌? అని నిలదీశారు. హత్యకు గురైన వివేకానందరెడ్డి కుటుంబీకులు పుట్టెడు కష్టంతో కుమిలిపోతున్నారని, నిష్పాక్షిక విచారణ జరగాలని ఆయన కూతురు ఓవైపు ఎన్నికల సంఘాన్ని కోరిందన్నారు.

ఈ హత్యపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారని, ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ కార్యదర్శికి కూడా మొరపెట్టుకున్నారని తెలిపారు. ఆ కుటుంబీకుల కళ్లల్లోని బాధ పవన్‌కు కనిపించలేదా? వారి బాధ చూసైనా మనసు కరగలేదా? అని ప్రశ్నించారు. జనసేన అధ్యక్షునిగా అధికారపక్షాన్ని ఈ విషయంలో నిలదీసే బాధ్యత ఆయనకు లేదా? అని నిలదీశారు. వివేకానందరెడ్డి హత్య ప్రభుత్వ వైఫల్యమేనని, హత్య జరిగి పదిరోజులైనా నిందితుల్ని పోలీసులు కనుక్కోలేకపోయారని బొత్స విమర్శించారు. ఏపీ పోలీసులు చాలా సమర్థులని, అలాంటి వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారని చెప్పారు. 

చంద్రబాబు పని అయిపోయింది..
సీఎం చంద్రబాబు తన వ్యక్తిగత ఆస్తులను అఫిడవిట్‌లో తక్కువ చేసి చూపించారని, సైకిల్‌పై యూనివర్సిటీకి వెళ్లిన చంద్రబాబు ఈరోజు దేశంలోనే ధనవంతుడైన రాజకీయవేత్త ఎలా అయ్యాడని బొత్స ప్రశ్నించారు. తన పరిధిలోని హెరిటేజ్‌ సంస్థ అంచెలవారీగా ఎలా అభివృద్ధి చెందింది? హైదరాబాద్‌లో వందల కోట్లు వెచ్చించి పెద్ద బంగళాను ఎలా కట్టుకున్నారని నిలదీశారు. అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించిన చంద్రబాబును ఎపుడెపుడు సాగనంపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఏప్రిల్‌ 11వ తేదీకోసం వారు వేచి ఉన్నారని బొత్స పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తాను ఐదేళ్లలో ఏం చేశారో చెప్పుకోవడం లేదని, చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతున్నారన్నారు. చంద్రబాబు పని ఇక అయిపోయిందని, ఏప్రిల్‌ 11 తరువాత టీడీపీ క్లోజ్‌ అవుతుందని అన్నారు. ప్రజల పక్షంగా అనునిత్యం పనిచేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ఒక అవకాశమివ్వాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తమకు అధికారమిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement