
దుగ్గిరాల : అక్రమ మైనింగ్ వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్ ప్రమేయం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. నాలుగున్నరేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. టీడీపీ నేతల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని, పంచ భూతాలను సైతం ఆక్రమిస్తున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు లక్షల టన్నుల అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారన్న ఆయన... ఈ విషయంలో టీడీపీ నేతలు అతి తెలివి ప్రదర్శిస్తూ కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోరాటం ఉధృతం చేస్తాం..
తమ నేతలను కాపాడుకునేందుకు టీడీపీ ప్రభుత్వం అనామకులపై కేసులు పెడుతూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బొత్స విమర్శించారు. యరపతినేని అక్రమ మైనింగ్‌ను సందర్శించేందుకు అనుమతినివ్వకపోవడం ద్వారా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నాయకులను అక్రమంగా నిర్బంధిస్తునారన్న బొత్స.. ఇలాంటి చర్యలకు భయడేది లేదని భవిష్యత్తులో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పోలీసుల తీరుపై బొత్స ఆగ్రహం..
అక్రమ మైనింగ్ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను కాజా టోల్‌గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా.. గుంటూరు వెళ్లనంటూ హామీనివ్వాలని, స్టేషనుకు వచ్చి సంతకం పెట్టాలని పోలీసులు ఆయనను కోరారు. ఈ నేపథ్యంలో తానూ చదువుకున్నానని, తనకు చట్టం గురించి తెలుసునని బొత్స అన్నారు. తానేమీ భయపడి పోలీసు స్టేషనుకు రాలేదని, పోలీసుల మీద ఉన్న గౌరవంతోనే వచ్చానని పేర్కొన్నారు. ఏం తప్పు చేశానని సంతకం పెట్టమంటున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. తప్పు చేస్తే కోర్టుకు తీసుకెళ్లాలి గానీ ఈ విధంగా ప్రవర్తించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment