
కేసీఆర్ దంపతులు, సీహెచ్. విద్యాసాగర్, వినోద్ కుమార్
బోయినపల్లి (చొప్పదండి): రాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలం ప్రత్యేక గుర్తింపు సంత రించుకుంది. కేవలం 28 వేల పైచిలుకు ఓటర్లు ఉన్న ఈ చిన్న మండలం ఎన్నికల వేళ ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. బోయినపల్లి మండలానికి ప్రముఖ నేతలతో ఉన్న బంధుత్వం, అనుబంధాలే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఈ మండలం అల్లుళ్లు కావడం.. అనేక మంది ప్రముఖుల చుట్టరికం ఉండటంతో ఈ మండలవాసులు తెగ ఫీలవుతుంటారు. ‘ఫలానోడు మా మండలం అల్లుడోయి’అని గర్వంగా చెప్పుకుంటారు.
బోయినపల్లి మం డలం కొదురుపాక గ్రామానికి చెందిన జోగినిపల్లి కేశవరావు, లక్ష్మి దంపతుల కూతురు శోభను పరిణయమాడిన సీఎం కేసీఆర్ కొదురుపాకకు అల్లుడయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు మండలంలోని కోరెం గ్రామానికి చెందిన చెన్నాడి సత్యనారాయణరావు, లచ్చమ్మ దంపతుల కూతురు వినోదను వివాహమాడారు. కార్యకర్తలు, విద్యాసాగర్‌రావు ఎంపీగా, ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. కరీంనగర్ ఎంపీగా పార్లమెంట్‌లో తన గళం వినిపిస్తున్న బోయినపల్లి వినోద్‌కుమార్ సైతం ఇక్కడి అల్లుడే. మండలంలోని కోరెం గ్రామానికి చెందిన చెన్నాడి మార్తాండరావు–రాజ్యలక్ష్మి కూతురు మాధవిని ఆయన వివాహమాడారు.
రాజ్యసభ సభ్యుడూ ఈ మండలవాసే
కేసీఆర్ తోడల్లుడు మండలంలోని కొదురుపాకకు చెందిన జోగినిపల్లి రవీందర్‌రావు కుమారుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే దివంగత చెన్నమనేని రాజేశ్వరరావు మండలంలోని మాన్వాడలో జన్మించి ఇక్కడే బాల్యం గడిపారు. ఆయన కూతురును మండలంలోని నర్సింగాపూర్‌కు చెందిన జోగినిపల్లి రాజేశ్వరరావుకు ఇచ్చి వివాహం చేశారు. కరీంనగర్ చల్మెడ ఆసుపత్రి అధినేత లక్ష్మీనరసింహరావుకు కోరెం గ్రామంతో చుట్టరికం ఉంది. రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నాయకులతో బోయినపల్లి మండలానికి అనుబంధం ఉండటం ఎన్నికలప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment