ఆ గులాబీ ఎమ్మెల్యే ఆత్మరక్షణలో పడ్డారా? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని అనుమానిస్తున్నారా? తనవెనుక ఉన్నవారే తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆందోళన చెందుతున్నారా? అత్యంత ఆత్మీయుల సమ్మేళనాలు నిర్వహిస్తున్నా ఆ ఎమ్మెల్యే మళ్ళీ పుంజుకోగలరా? గులాబీ దళపతి ఆదరణ పొంది టిక్కెట్ సంపాదించగలుగుతారా?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్సీ నియోజకవర్గాల్లో ఒకటైన చొప్పదండి ఎమ్మెల్యేగా అధికార బీఆర్ఎస్ నుంచి సుంకె రవిశంకర్ కొనసాగుతున్నారు. ప్రజల్లో, పార్టీలో ఆయనకు ఆదరణ తగ్గిందని.. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు రాదనే చర్చ నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. స్వయంగా ఎమ్మెల్యే రవిశంకర్‌కే తనకు టిక్కెట్ రాదనే అనుమానం గట్టిగా పీడిస్తోందని టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో ఆయన ఎవరినీ కలుపుకొనిపోవడంలేదన్న భావన కొందరిలో కనిపిస్తుండగా.. చొప్పదండి బీఆర్ఎస్ నేతలు మూడు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కేడర్ అభిప్రాయపడుతోంది.
సిటింగ్ ఎమ్మెల్యేకు గత ఎన్నికల్లో ఆర్థికంగా, సామాజికపరంగా ఉపయోగపడ్డ కొందరు అగ్రవర్ణాల నేతలు ఈసారి రవిశంకర్‌పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు.. కరీంనగర్ కు చెందిన ఒక కార్పోరేటర్..బోయినపల్లి ఎంపీపీ సహా మరికొందరు నేతలు చొప్పదండి సీటుపై కన్నేసినట్లుగా ప్రచారం సాగుతోంది.
గులాబీ పార్టీ అధిష్ఠానం నిర్వహించిన సర్వేల్లోనూ ప్రస్తుత ఎమ్మెల్యే రవిశంకర్ పరిస్థితిపై సానుకూలత కనిపించడంలేదని టాక్. స్థానికంగా పార్టీలో నెలకొన్న తలనొప్పులు.. ప్రస్తుత ఎమ్మెల్యేకు పోటీగా టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న నేతల తీరుతో సిట్టింగ్ తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలతో వచ్చే ఎన్నికలకు సంసిద్ధమవుతుంటే.. చొప్పదండి సిటింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అత్యంత ఆత్మీయ సమ్మేళనాలనూ నిర్వహిస్తున్నారట.
సోషల్ మీడియాలో తగ్గేదేలే..
అందులో తనకు టిక్కెట్ వచ్చే అవకాశాలకు ఎక్కడా గండి పడకుండా మనవాళ్లంతా ప్రయత్నించాలని కోరినట్టుగా కూడా ఇప్పుడు ఓ చర్చ ప్రచారంలోకొచ్చింది. పైగా సోషల్ మీడియాలో తగ్గేదేలే అన్నట్టుగా కౌంటర్ అటాక్స్ కు కూడా సిద్ధం కావాలని.. ఎక్కడా గులాబీబాస్ దృష్టిలో తక్కువ కాకుండా ఉండేలా అన్నివిధాలా తమ నడవడిక ఉండాలని కోరినట్టు తెలుస్తోంది.
తన వ్యవహారశైలితో అటు అధిష్టానం దృష్టిలో..ఇటు స్థానిక నేతలు, కార్యకర్తల దృష్టిలో నెగెటివ్ మార్కులు తెచ్చుకున్న సుంకె రవిశంకర్ తిరిగి ఒడ్డుకు చేరుకోగలుగుతారా? పార్టీ అధినేతతో టిక్కట్ తనకే ఇస్తామనే పరిస్థితి క్రియేట్ చేసుకోగలుగుతారా? పార్టీలోని ప్రత్యర్థులను దారికి తెచ్చుకోగలరా? ఇప్పుడు చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుపైన, ఆయన భవిష్యత్ పైనా హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.
చదవండి: ఒక్కలిగల కంచుకోటలో పాగా ఎవరిదో...!
Comments
Please login to add a commentAdd a comment