మంత్రి అఖిల , ఎమ్మెల్యే బుడ్డా
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇప్పటివరకు నీరు–చెట్టు పథకం కింద పోటీపడి పనులు తీసుకున్న అధికార పార్టీ నేతలు.. ప్రస్తుతం ఆ పనులు లేకపోవడంతో ఎర్రమట్టిపై కన్నేశారు. ఎలాంటి అనుమతి లేకుండానే భారీఎత్తున ఎర్రమట్టిని తవ్వుతూ రూ.కోట్లలో వెనకేసుకుంటున్నారు. నంద్యాల పట్టణానికి సమీపాన మహానంది మండల పరిధిలో సాగుతున్న ఎర్రమట్టి తవ్వకాల వ్యవహారం ఇప్పుడు మంత్రి అఖిలప్రియకు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి మధ్య విభేదాలను తీవ్రస్థాయికి తీసుకెళుతోంది. తన నియోజకవర్గంలో తాను మాత్రమే ఎర్రమట్టిని తవ్వుకుంటానని ఎమ్మెల్యే బుడ్డా వాదిస్తున్నారు. అయితే.. తాము పొలందారుడి నుంచి లీజుకు తీసుకున్నామని మంత్రి అనుచరులు అంటున్నారు. అటు ఎమ్మెల్యే అనుచరులు బుడ్డా స్టిక్కర్ ఉన్న వాహనాల్లో తిరుగుతూ ఎర్రమట్టిని అక్రమంగా తవ్వుతున్నారు. ఇటు మంత్రి అనుచరులు కూడా ఆమె స్టిక్కర్ అతికించి ఉన్న వాహనాల్లో హల్‌చల్ చేస్తూ మట్టి దందా సాగిస్తున్నారు.
వరుస చెదిరి..చిచ్చు రేగి
అఖిలప్రియను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ‘కోడలా..’ అని పిలిచేవారు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య అంటే మామ– కోడళ్ల మధ్య రేగిన మట్టి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. మంత్రి అక్రమంగా ఎర్రమట్టిని తవ్విస్తున్నారంటూ ఏకంగా విజిలెన్స్ విభాగానికి ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇదే తరుణంలోవిజిలెన్స్ సిబ్బంది అక్కడికి వెళ్లే సమయానికి తన వాహనాలు తిరగకుండా ఎమ్మెల్యే తెలివిగా వ్యవహరించారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మట్టి దందాపై లోతుగా విచారణ జరపవద్దంటూ విజిలెన్స్ సిబ్బందికి కూడా మంత్రి నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది.
ఇటుకల తయారీదారులకు బెదిరింపులు
ఎర్రమట్టిని అటు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఇటు మంత్రి అఖిలప్రియ అనుచరులు పోటీపడి తవ్వేస్తున్నారు. ఈ విధంగా తవ్విన మట్టిని మొత్తం ఇటుకల తయారీదారులకు సరఫరా చేయాల్సిందే. ఈ నేపథ్యంలో వారికి ఇరువురి నేతల అనుచరుల నుంచి తమ మట్టే తీసుకోవాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇక ఈ పోటీ ఎక్కడి వరకు వెళ్లిందంటే.. డబ్బు ఇవ్వకపోయినప్పటికీ ఎర్రమట్టిని ఇటుకల తయారీదారులకు ముందుగానే తోలుతున్నారు. ఒకానొకదశలో ధర కూడా పోటీపడి తగ్గించారు. ఈ వార్ కాస్తా ముదిరి ఏకంగా ఇటుకల తయారీదారులను బెదిరించే స్థాయికి చేరుకుంది. తమ ఎర్రమట్టే తీసుకోవాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని ఇరువురు నేతల అనుచరులు బెదిరిస్తున్నారు. నంద్యాల చుట్టుపక్కల 400 నుంచి 500 వరకు ఎర్ర ఇటుకల బట్టీలు ఉన్నాయి. వీటి నిర్వాహకులు కాస్తా ఇరువురు నేతల అనుచరుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఒక్కటవుతున్న వైరి వర్గం
ఇప్పటికే మంత్రి అఖిలప్రియకు, భూమా సన్నిహితుడు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల పర్యాటక శాఖ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలో మొదట ఏవీ సుబ్బారెడ్డి పేరును ప్రచురించలేదు. దీనిపై విమర్శలు రావడంతో ఆ తర్వాత పర్యాటక శాఖ ఆయన పేరును ప్రచురించింది. నంద్యాలకు ఆగస్టు 15న మంత్రి హోదాలో అఖిలప్రియ వచ్చిన సందర్భంలో కౌన్సిలర్లు ఎవ్వరూ వెళ్లవద్దంటూ ఏవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. ఆ కార్యక్రమానికి మంత్రితో పాటు కొద్దిమంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. ఇప్పుడు ఎర్రమట్టి వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే బుడ్డా.. అఖిలప్రియతో విభేదాలు ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని దగ్గరకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన బంధువుకు కూడా ఎర్రమట్టి తవ్వకాల్లో కొంచెం వాటా ఇచ్చారని సమాచారం. మొన్నటివరకు ‘కోడలా’ అని పిలిచిన బుడ్డానే ప్రస్తుతం మంత్రి అఖిలప్రియకు వ్యతిరేకంగా కూటమి కడుతుండడంపై ఆ పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది. ఈ ఇద్దరు నేతల మధ్య రేగిన చిచ్చు ఎక్కడి దాకా వెళ్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment