
మీడియాతో మాట్లాడుతున్న బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో లెక్కలన్నీ అవాస్తవాలేనని, నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. గతంలో మాదిరిగానే బడ్జెట్‌లో గొప్పలు చెప్పారు తప్ప, లెక్కలు వాస్తవ దూరం అన్నారు. బడ్జెట్‌పై బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఎప్పటి మాదిరిగానే ఏపీ 2022వ సంవత్సరం కల్లా దేశంలో టాప్ 3వ స్థానంలో ఉంటుందని, 2029లో దేశంలోనే ఉన్నత స్థానంలో ఉంటుందని, 2050కి ప్రపంచంలోనే ఏపీ ఉన్నతంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతుందన్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని చంద్రబాబు చెబుతూనే.. బ్రహ్మండంగా స్థూల ఉత్పత్తి ఉందని పేర్కొనడం ఎంతవరకు సమంజసమన్నారు. రాష్ట్రానికి సీఐఐ సదస్సుల ద్వారా రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షల్లో ఉద్యోగాలు వచ్చాయని చెబుతున్నారని విమర్శించారు.
లోటు ఎందుకు తీరడం లేదు?
రాష్ట్రంలో బ్రహ్మండంగా ఆదాయం ఉంటే రెవెన్యూ లోటు ఎందుకు తీరడం లేదని బుగ్గన ప్రశ్నించారు. 2015–2016లో రూ.7300 కోట్లు, 2016లో రూ.2220 కోట్లు, 2017–2018లో రూ.4018 కోట్లు లోటు ఉందని చెప్పారన్నారు. ఈ లెక్కలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించిన సొంత పన్ను రూ.65353 కోట్లు అన్నారు. గతేడాది రూ.50300 కోట్లు ఉండేదన్నారు. రెవెన్యూ రాబడి ఎక్కువగా చూపుతున్నారని తప్పుపట్టారు. రెవెన్యూ లోటుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్నారు.
డిజైన్ కూడా ఫైనలైజ్ కాలేదు
రాజధాని నిర్మాణం వేరు.. నగరం కట్టడం వేరని రాజేంద్రనాథ్‌రెడ్డి వివరించారు. స్వీస్ చాలెంజ్ అన్నది ముడుపులతో కూడినదని విదేశీయులకు కూడా అర్థమైందన్నారు. చిన్న మిషన్ కావాలన్నా కూడా బ్యాంకులు ప్రాజెక్టు రిపోర్టు అడుగుతారన్నారు. నాలుగేళ్లుగా డీపీఆర్ లేదని, ఇంతవరకు రాజధాని డిజైన్ కూడా ఫైనలైజ్ కాలేదన్నారు. అప్పుడు కేంద్రం మనకు ఎంత ఇవ్వాలి, మన వద్ద ఎంత ఉందన్నది లెక్కలు వేసుకోవాలన్నారు.