సాక్షి, తాడికొండ : గుంటూరు జిల్లాలో ప్రధాన పార్టీల తరుఫున ఈ సార్వత్రిక ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులే అధికంగా పోటీ చేయడం విశేషం. మొత్తం 8 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గుంటూరు ఎంపీగా వైఎస్సార్ సీపీ తరఫున తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, బాపట్ల ఎంపీగా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన నందిగం సురేష్ బరిలో నిలిచారు.
ఇక అసెంబ్లీ అభ్యర్థులుగా ఫిరంగిపురం గ్రామానికి చెందిన మేకతోటి సుచరిత ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. స్థానికత కోటాలో తాడికొండ నియోజకవర్గానికి ఉండవల్లి శ్రీదేవి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీలో ఉండగా, పెదపరిమి గ్రామానికి చెందిన నంబూరు శంకర్రావు పెదకూరపాడు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
తాడికొండ గ్రామానికి చెందిన మహమ్మద్ ముస్తఫా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండో సారి ఎన్నికలకు వెళ్తున్నారు. సీపీఐ తరుఫున మంగళగిరి నుంచి తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రావెల కిషోర్‌బాబుది తాడికొండ మండలం రావెల గ్రామమే.
Comments
Please login to add a commentAdd a comment