రావెల కిషోర్‌బాబు, మేకతోటి సుచరిత, డొక్కా మాణిక్యవరప్రసాద్
సాక్షి, ప్రత్తిపాడు : ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇప్పుడు ఓ అంశం చర్చనీయాంశమవుతోంది. అందరి నోళ్లలోనూ ఇదే నానుతోంది. ఇది ప్రత్తిపాడు నియోజకవర్గమా లేక తాడికొండ నియోజకవర్గమా అంటూ ఓటర్లు ఛలోక్తులు విసురుతున్నారు. కారణం ప్రత్తిపాడు అసెంబ్లీ బరిలో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులంతా తాడికొండ నియోజకవర్గ వాసులు, ఆ నియోజకవర్గంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులే కావడంతో పొలిటికల్ కారిడార్‌లో చక్కర్లు కొడుతుందీ టాపిక్.
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకతోటి సుచరిత స్వగ్రామం తాడికొండ నియోజకవర్గంలోని ఫిరంగిపురం. ఈమె 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచి విజయం సాధించారు. ప్రస్తుతం 2019 ఎన్నికల్లో సైతం ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు.
- జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రావెల కిషోర్‌బాబుది సైతం తాడికొండ నియోజకవర్గమే. తాడికొండ మండలం రావెల గ్రామం. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించి మంత్రి పదవిని కైవసం చేసుకున్నారు. తాజాగా 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
- టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా తాడికొండ నియోజకవర్గానికి సుపరిచితులే. స్వగ్రామం ఆ నియోజకవర్గం కాకున్నప్పటికీ గత కొద్ది సంవత్సరాలుగా అక్కడి ప్రజలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కూడా. ప్రస్తుతం ఈయన ఎమ్మెల్సీగా కొనసాగుతూ ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
- భారతీయ జనతా పార్టీ కూడా తాడికొండ నియోజకవర్గ అల్లుడికే ప్రత్తిపాడు సీటును కేటాయించింది. వృతిరీత్యా వైద్యుడైన డాక్టర్ చల్లగాలి కిషోర్ తాడికొండకు చెందిన డాక్టర్ సబితను వివాహం చేసుకున్నారు. ఈయన ప్రస్తుతం ప్రత్తిపాడు నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment