న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల్లో వాస్తవం లేదని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తును 2013 ఆగస్టు 7న ముగించామనీ, ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆధారాలేవీ తమకు లభించలేదని కోర్టుకు సీబీఐ చెప్పింది. ఈ కేసుకు సంబంధించి ఓ అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించింది. ములాయం, ఆయన కొడుకు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, మరో కుమారుడు ప్రతీక్ యాదవ్, అఖిలేశ్ భార్య డింపుల్ తదితరులపై అక్రమాదాయ ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నాయకుడు విశ్వనాథ్ చతుర్వేది 2005లో పిటిషన్ వేశారు.
ఈ ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా 2007లో సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ విచారణను నిలిపివేయాలంటూ ములాయం, ఆయన కొడుకులు వేసిన పిటిషన్‌ను 2012లో సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ, దర్యాప్తు కొనసాగించాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. అయితే అప్పటికీ డింపుల్ ప్రభుత్వ పదవిలో లేనందున ఆమెపై మాత్రం విచారణ నిలిపేయాల్సిందిగా కోర్టు స్పష్టం చేసింది. 2012లో సుప్రీంకోర్టు ఆదేశాలతో తాము విచారణ కొనసాగించగా, అక్రమ మార్గాల్లో ఆస్తులు సంపాదించారనేందుకు తమకు ప్రాథమిక ఆధారాలేవీ లభించలేదని సీబీఐ తన 21 పేజీల అఫిడవిట్‌లో పేర్కొంది. 2013 ఆగస్టు 7 నాటికే ఈ కేసులో విచారణను ముగించామంది. ప్రాథమిక ఆధారాలు కూడా లేనందున ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని సీబీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment