సాక్షి, అమరావతి: తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం ఉపసంహరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం శాసన మండలిలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిపాలన వికేంద్రీకరణ బిల్లును, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్‌డీఏ చట్టం ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు. వీటిని ప్రవేశపెట్టే విషయమై ఉదయం సభ ప్రారంభం నుండి సాయంత్రం వరకు అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యులు పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగించారు. సభలో బిల్లులు ప్రవేశపెట్టకుండా అడ్డుకునే ఉద్దేశంతో రూల్–71 కింద నోటీసు ఇచ్చి, దానిపై చర్చకు టీడీపీ పట్టుబట్టగా, బిల్లులు ప్రవేశపెట్టాలని అధికార పక్షం పదేపదే విజ్ఞప్తి చేసింది. దీనిపై నిర్ణయం తీసుకునే విషయంలో గందరగోళం నెలకొనడంతో మండలి చైర్మన్ షరీఫ్ పలుమార్లు సభను వాయిదా వేశారు.
మధ్యాహ్నం తర్వాత తిరిగి సభ ప్రారంభమైన అనంతరం చైర్మన్ అధికార, విపక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో మొదట రూల్–71పై చర్చించి ఆ తర్వాత బిల్లులు ప్రవేశపెట్టే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించారు. దీనిపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. బీఏసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రభుత్వ బిల్లులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని.. సందర్భం లేకుండా రూల్–71ను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని.. రూల్–71 అంశంపై చర్చించిన అనంతరం బిల్లుల విషయమై ఆలోచిద్దామని అనడంతో మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ఏ అంశంపై అయినా జీఓ విడుదలైన తర్వాత దానికి సంబంధించిన విధానం చర్చకు వస్తుందని తెలిపారు. కానీ, రూల్–71పై చైర్మన్ ఇచ్చిన రూలింగ్ సరికాదని.. దానికంటే ముందు తమ బిల్లులనే తీసుకోవాలని కోరారు. అలాగే, మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత దానిపై ప్రతిపక్షం డివిజన్ కోరినా ఆమోదించినా, తిరస్కరించినా వారిష్టమని, అయితే ముందు బిల్లులు ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని కోరారు. సాయంత్రం రూల్–71పై నిర్వహించిన ఓటింగ్‌లో అనుకూలంగా 27మంది, వ్యతిరేకంగా 11మంది ఓటేశారు. తటస్థంగా తొమ్మిది మంది నిలిచారు.
బిల్లులను అడ్డుకోవడం సరికాదు : కంతేటి
ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను అడ్డుకోవడం సరికాదని, విలువైన సూచనలు చేసి సహకరించాలని ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు సూచించారు. గతంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి వారికి తగినంత మంది సభ్యులు లేకపోయినా ప్రతిపక్ష సభ్యులు సహకరించి బిల్లులపై మండలిలో చర్చకు సహకరించిన విషయాన్ని గుర్తుచేశారు. మండలిని రద్దుచేసుకునే పరిస్థితిని తీసుకురావద్దని హితవు పలికారు.
బిల్లులను అడ్డుకోవడం సరికాదు : పీడీఎఫ్
పీడీఎఫ్ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో బిల్లులు ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతున్నా వాటిని అడ్డుకోవడం సరికాదన్నారు. అసెంబ్లీలో అమోదం పొందిన బిల్లులు శాసనమండలికి వస్తే వాటిని అనుమతించకుండా చిన్నచిన్న సాంకేతిక కారణాలు చూపి గంటల తరబడి సభను స్తంభింపజేయడం ఏమిటని ప్రశ్నించారు. 13 ఏళ్లలో ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు.
బిల్లులపైనే మొదట చర్చ : బీజేపీ
బీజేపీ సభ్యుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత రూల్–71 అంశంపై చర్చించేలా చూడాలని కోరారు. మరోవైపు.. తాము ప్రతిపాదించిన అంశంపైనే చర్చ జరగాలని టీడీపీ.. బిల్లులను ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ సమయంలో మంత్రి బొత్స మరోసారి మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు చెప్పినట్లు చేస్తే ఎలాగని చైర్మన్‌ను ప్రశ్నించారు. చైర్మన్ పదవి గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని కోరారు. మళ్లీ గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.
అనంతరం తిరిగి సమావేశమైన తర్వాత ఇరుపక్షాల మధ్య సమోధ్య కుదిర్చేందుకు చైర్మన్ షరీఫ్ ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో ప్రభుత్వం కోరిన విధంగా ముందు రెండు బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత రూల్–71 ప్రకారం చర్చ ప్రారంభించి మొత్తం మూడు అంశాలను కలిపి చర్చించేందుకు చైర్మన్ అనుమతించారు. అనంతరం.. మంత్రులు బుగ్గన, బొత్స రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. చర్చ అయినా ప్రారంభించండి లేదా బిల్లులను పాస్ చేయాలని చైర్మన్‌ను కోరారు. ఈ పరిస్థితుల్లో యనమల మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు సవరణలు ప్రతిపాదిస్తామని, సెలక్ట్ కమిటీకి పంపాలన్నారు. రూల్–71 అంశం, రెండు బిల్లులను విడివిడిగా చర్చించాలని కోరారు.
అంతకుముందు సభలో ఇలా..
అంతకుముందు.. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే చైర్మన్ షరీఫ్ మాట్లాడుతూ, అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో ఆమోదం కోసం పంపారని ప్రకటించారు. తర్వాత టీడీపీ సభ్యులు రూల్–71 ప్రకారం నోటీసు ఇచ్చారని పరిగనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ తదితర మంత్రులతో పాటు వైఎస్సార్‌సీపీ సభ్యులు కోరారు. అసెంబ్లీలో ఆమోదం పొంది సభకు వచ్చిన బిల్లుకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని.. నిబంధనలు కూడా ఇవే చెబుతున్నాయన్నారు. అదే రూల్–71 నోటీసుపై ఏడు రోజుల్లో ఎప్పుడైనా చర్చకు చేపట్టవచ్చన్నారు.
చెడు సంప్రదాయాలకు నాంది పలకొద్దు
రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ సభ్యులు కోరుతున్నట్లు రూల్–71 ప్రకారం ముందు చర్చకు అనుమతిచ్చి సభలో చెడు సంప్రదాయానికి నాంది పలకొద్దంటూ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, అవంతి శ్రీనివాసరావు, ఆళ్ల నాని, కె.నారాయణస్వామి, కొడాలి నాని, పేర్ని నాని, అనిల్‌కుమార్ యాదవ్, మోపిదేవి వెంకటరమణ, మేకపాటి గౌతంరెడ్డి, పుష్పశ్రీ వాణి, తానేటి వనిత, మేకతోటి సుచరితతో పాటు వైఎస్సార్‌సీపీ సభ్యులు చైర్మన్‌ను కోరారు. అయినప్పటికీ చైర్మన్ స్పందించకపోవడంతో అధికార పార్టీకి చెందిన సభ్యులు పలుమార్లు వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు.
వైఎస్సార్‌సీపీ సభ్యులు జంగా కృష్ణమూర్తి, వెన్నపూస గోపాల్‌రెడ్డి, షేక్ మహ్మద్ ఇక్బాల్, గంగుల ప్రభాకర్‌రెడ్డిలు పొడియం వైపు వెళ్లి బిల్లులపై మొదట చర్చించాలని పట్టుబట్టారు. ఇలా.. అధికార, విపక్ష సభ్యులు ఎవరికి వారు తమ వాదనకే కట్టుబడడంతో చైర్మన్ షరీఫ్ పలుమార్లు సభను వాయిదా వేశారు. చివరికి చైర్మన్ రూల్–71 కింద చర్చకు చైర్మన్ అనుమతిచ్చారు. చర్చలో టీడీపీ సభ్యులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సభలో సవాళ్లు, ప్రతిసవాళ్లతో గందరగోళం నెలకొంది. మరోవైపు.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులపై బుధవారం శాసన మండలిలో చర్చ చేపట్టనున్నారు.
టీడీపీకి ఐదుగురు ఎమ్మెల్సీల షాక్
తెలుగుదేశం పార్టీకి ఐదుగురు ఎమ్మెల్సీలు షాక్ ఇచ్చారు. మూడు రాజధానులపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరికి మద్దతివ్వకుండా వారు ఝలక్ ఇచ్చారు. పోతుల సునీత, చదిపిరాల శివనాథరెడ్డి శాసన మండలిలో 71 రూలుపై జరిగిన చర్చకు నిర్వహించిన ఓటింగ్‌లో పార్టీకి నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. శత్రుచర్ల విజయరామరాజు, శమంతకమణిలు మండలికి గైర్హాజరై పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు. మరో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏకంగా టీడీపీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఓటింగ్‌లో రూల్–71కి అనుకూలంగా 27 మంది, వ్యతిరేకంగా 11మంది ఓటు వేయగా 9 మంది తటస్థంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment