సాక్షి, అమరావతి: తాము రాష్ట్ర ప్రజల డేటా దొంగిలించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం భారీ కుట్రని, భారతదేశ చరిత్రలో ఇలాంటి కుట్ర ఎన్నడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఒక పథకం ప్రకారం విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాకుట్ర రచించారని..ఇది బాహుబలిని మించిన కుట్రని చెప్పారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన డేటా చోరీ అంశంపై మాట్లాడారు. ఈ ఫిర్యాదు కుట్రను తాను ప్రజల ముందు పెడుతున్నానని, మోడీ, అమిత్‌షా, కేసీఆర్, జగన్ బరితెగించి ఈ కుట్ర చేశారని విమర్శించారు. గత నెల 19 తేదీన విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారని దాని ప్రకారం తెలంగాణ పోలీసులు చట్ట విరుద్ధంగా 23వ తేదీన ఐటి గ్రిడ్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్‌వేర్ కంపెనీపై దాడి చేశారని చెప్పారు. టీడీపీ సేవా మిత్ర యాప్ సమాచారం, సభ్యత్వ నమోదు, కార్యకర్తల సంక్షేమ నిధి, ఇన్సూరెన్స్ సమాచారం అంతా చోరీ చేశారని ఆరోపించారు. దాడులు చేసిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో డేటా దొంగతనం వార్త ప్రచురితమైందని తెలిపారు. ఈ ఫిర్యాదు తాను చేసినట్లు విజయసాయిరెడ్డి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
ఎవరి ఫిర్యాదుతో ఐటీ గ్రిడ్‌పై దాడి చేశారు?!..
తెలంగాణ వేసిన సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర 23వ తేదీన ఐటీ గ్రిడ్‌పై దాడి నిజమేనని ఒప్పుకున్నాడని చంద్రబాబు చెప్పారు. కాగా, విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారని చెబుతూ...ఆ ఫిర్యాదు కాపీని విడుదల చేసిన ఆయన.. ఎవరి ఫిర్యాదుతో ఫిబ్రవరి 22న ఐటీ గ్రిడ్‌పై దాడి చేశారని ప్రశ్నించడంతో మీడియాతో సహా అక్కడున్న టీడీపీ నేతలు సైతం అవాక్కయ్యారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులోనే కుట్రకు స్కెచ్ ఉందని, అందులో కుట్రకు కార్యాచరణ ప్రణాళిక రచించారని..వినతికి అనుబంధంగా కుట్ర యాక్షన్ ప్లాన్ కూడా ఈసీకి అందించారని తెలిపారు. ఫిర్యాదులో యాక్షన్ పాయింట్స్, టాకింగ్ పాయింట్స్ కూడా రాశారని అన్నారు. సోదాల్లో ఐటీ గ్రిడ్ ఆఫీసులో ఏం చేయాలి, ఎవరెవరిని ఎలా విచారించాలి, ఎఫ్‌ఐఆర్ ఎలా రిజిష్టర్ చేయాలి, డేటా ఎలా సీజ్ చేయాలి, ఉద్యోగుల సెల్ ఫోన్లు ఎలా లాక్కోవాలి, వారిని ఎలా వేధించాలి, ఎలా బెదిరించాలి, సేవా మిత్ర యాప్‌ను ఎలా నిర్వీర్యం చేయాలి, సేవామిత్ర కీలక కార్యకర్తలను ఎలా గుర్తించాలి, కోర్టు ద్వారా సీబీఐ విచారణ ఎలా కోరాలి, జాతీయ మీడియాకు ఇవన్నీ ఎలా తెలపాలనే అన్ని విషయాలను పేర్కొన్నారని ఆరోపించారు. ఇదే ఫిర్యాదును ఈసీకి మార్చి ఎనిమిదో తేదీన బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి చేశారని, దీనిప్రకారం తెలంగాణ పోలీసులు పనిచేశారన్నారు.
రెండు, మూడు రోజుల్లో అశోక్ బయటకు వస్తాడు..
ఐటీ గ్రిడ్ సంస్థ తమ అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ అని, అందులో పనిచేసే వారిని హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి బయటకు తీసుకురావాల్సి వచ్చిందన్నారు. కాగా, దాకవరపు అశోక్ ఎక్కడున్నాడనే మీడియా ప్రశ్నకు రెండు, మూడురోజుల్లో బయటకు వస్తాడని చెప్పారు. దీంతో తామే అశోక్‌ను దాచామనే విషయాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పడంతో.. అక్కడున్న టీడీపీ నేతలు ఇబ్బందిగా కనిపించారు. ఈ కేసుకు సహకరించిన తెలంగాణ పోలీసులను తాము వదలబోమని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజల ఆధార్ కార్డును పార్టీ యాప్‌కు లింక్ చేశారనే ఆరోపణపై మాట్లాడుతూ ఆధార్ ఎక్కడ లీకైందని దబాయించి.. ఆధార్ నంబర్ ఇస్తే తీసుకోవచ్చని అయినా ఆధార్ డేటా తీసుకుని కార్యకర్తలు ఏంచేస్తారని, వారికి కావల్సింది ఓటరు జాబితా అని చెప్పారు. బ్లూఫ్రాగ్ సంస్థ చాలా సంవత్సరాలుగా తమకు సేవలందిస్తోందని తెలిపారు. ఫార్మ్–7 దాఖలు చేయడం పెద్ద నేరమని, తన ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్ వేల కోట్లను ఏపీకి పంపిస్తున్నాడని, ఇప్పటికే వెయ్యి కోట్లు జగన్‌కు ఇచ్చాడని, అవి అభ్యర్థులకు చేరిపోయాయని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లుగా హైదరాబాద్ నుంచి రాకుండా కేసీఆర్‌తో కలిసి కుట్రలు చేస్తున్నాడన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ తయారు చేస్తున్నారని, వైసీపీ అధ్యక్షుడు జగన్ కాదని కేసీఆర్ అని చంద్రబాబు విమర్శించారు.
ఇది బాహుబలిని మించిన కుట్ర..
Published Sun, Mar 10 2019 4:30 AM | Last Updated on Sun, Mar 10 2019 8:22 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment