
సాక్షి, అమరావతి: సీనియర్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావుపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నోరుపారేసుకున్నారు. జీఎన్ రావు పనికిమాలిన వ్యక్తి అంటూ అక్కసు వెళ్లగక్కారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన జీఎన్ రావు వివిధ హోదాల్లో ప్రభుత్వానికి, ప్రజలకు విశేషమైన సేవలు అందించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్నసీనియర్ ఏఐఎస్ జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి విషయమై ఐఏఎస్ జీఎన్ రావు కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను.. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) ఇచ్చే నివేదికను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్ అధికారిపై నోరుపారేసుకుంటూ.. ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడంపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. గతంలోనూ పలు సందర్భాల్లో అధికారులను దుర్భాషలాడుతూ చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసింది.