
నక్కపల్లి/పాయకరావుపేట: పాయకరావుపేటలో ఆది వారం నిర్వహించిన చంద్రబాబు రోడ్‌షోలో సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనితను వ్యతిరేకించిన వర్గాన్నే అందల మెక్కించారు. ఆమె వర్గానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆద్యంతం వ్యతిరేక వర్గీయులే రోడ్‌షోలో హడావుడి చేశారు. దీంతో అనిత వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పైకి చెప్పుకోలేనప్పటికీ లోలోపన కుమిలిపోయారు. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులకే ప్రాధాన్యం ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ పదవుల్లో ఉండి, ఎమ్మెల్యేకు తిరిగి రెండో సారి టికెట్ ఇవ్వాలని కోరడమే మేం చేసిన నేరమా అంటూ వారు మదనపడుతున్నారు.
వ్యతిరేక వర్గానిదే పెత్తనం
పాయకరావుపేట చిత్రమందిర్ సెంటర్లో ఆదివారం జరిగిన రోడ్‌షోలో చంద్రబాబు గంటసేపు ప్రసంగించారు. వేదికకు ఉపయోగించిన బస్సుపైకి ఎక్కే అవకాశం సిట్టింగ్ ఎమ్మెల్యే అనితను వ్యతిరేకించిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోటనగేష్, ఎస్.రాయవరం ఎంపీపీ వినోద్‌రాజు, విశాఖ డెయిరీ డైరెక్టర్ రెడ్డి రామకృష్ణకు మాత్రమే కల్పించారు. మిగిలిన నేతలెవరికి అవకాశం కల్పించలేదు. నాలుగు మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, సమన్వయకమిటీ సభ్యులు, జెడ్పీటీసీలు వచ్చినప్పటికీ వారికి ప్రాధాన్యమివ్వలేదు.
సీఎం రోడ్‌షోలో అన్నీతానై వ్యవహరిస్తున్న అసమ్మతి నేత తోట నగేష్
కొనసాగుతున్న గ్రూపులు
పాయకరావుపేట టికెట్ వ్యవహారంలో పార్టీలో రెండు గ్రూపులుగా చీలిపోయి సీఎం వద్ద బలప్రదర్శనకు దిగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అనితకు టికెట్ ఇవ్వకుండా కేజీహెచ్ వైద్యుడు బంగారయ్యను ఎంపిక చేశారు. కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తే వర్గాలన్నీ కలిసి పనిచేస్తాయని అందరూ భావించినా గ్రూపులు మాత్రం యధావిధిగానే కొనసాగుతున్నాయి.
అసమ్మతి వర్గం గుప్పిట్లో బంగారయ్య
చంద్రబాబు వచ్చిన త ర్వాత అన్నీ సమసిపో యి, బంగారయ్య అందరిని కలుపుకొని పోతాడని ఆయన నోటి వెంట ఏదైనా మాట వస్తుందా అనే ఆశతో సమ్మతి నాయకులు ఎదురుచూశారు. కానీ చంద్రబాబు ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. కొత్త అభ్యర్థి బంగారయ్యను కూడా అసమ్మతి వర్గం తన గుప్పెట్లోకి తెచ్చుకుందన్న ప్రచారం జరుగుతోంది. నామినేషన్ దాఖలు మొదలుకుని చంద్రబాబు రోడ్‌షో వరకు జనసమీకరణ అసమ్మతి వర్గీయులదే పై చేయిగా కనిపించడంతో అనిత వర్గం రగిలిపోతున్నారు. అసమ్మతి వర్గీయుల ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
గ్రూపులతో వేగలేకపోతున్నా:బాబుకు బంగారయ్య మొర?
నియోజకవర్గ టీడీపీలో ఉన్న గ్రూపులతో తాను వేగలేకపోతున్నానంటూ అభ్యర్థి బంగారయ్య అధినేత చంద్రబాబుకు మొర పెట్టుకున్నట్లు తెలిసింది. పాయకరావుపేట రోడ్‌షో ముగించుకుని తిరుగు ప్రయాణంలో విశాఖ వెళ్తున్న చంద్రబాబు హెలీప్యాడ్ వద్ద కొద్దిసేపు బస్సులో నియోజకవర్గానికి చెందిన తోటనగేష్, పెదిరెడ్డి చిట్టిబాబు, రెడ్డిరామకృష్ణతో మాట్లాడారు. జాగ్రత్తగా పనిచేయాలని పేర్కొంటూ అభ్యర్థిని గెలిపించే బాద్యత నీదేనంటూ జిల్లాగ్రంథాలయసంస్థ మాజీ చైర్మన్ తోటనగేష్‌కు అప్పగించినట్లు భోగట్టా. దీంతో అనిత వర్గీయులు డీలా పడ్డారు. అలాగే నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా నియమించిన మాజీ ఎమ్మెల్యే గండిబాజ్జిని తిరిగి పెందుర్తి నియోజకవర్గానికి వెళ్లిపోయి అక్కడ పార్టీ గెలుపుకోసం పనిచేయాలని సూచించినట్లు సమాచారం.
సీఎం రోడ్‌షోకు స్పందన కరువు
నక్కపల్లి/పాయకరావుపేట: అత్మస్తుతి, పరనిందతోనే సీఎం చంద్రబాబు రోడ్‌షో ముగిసింది. ఆయన ప్రసంగం ప్రజలకు విసుగు పుట్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్షనేత జగన్‌ను విమర్శించేందుకే ఎక్కువ సమయం కేటాయించారు. జగన్‌ను విమర్శించే సమయంలో రోడ్‌షోకు హా జరైన వారినుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. జగన్ ఒక సారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాడు ఇద్దామా తమ్ముళ్లు ఎందుకు ఇవ్వాలి తమ్ము ళ్లు అంటూ పదే పదే సమాధానం రాబట్టేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. చెప్పండి తమ్ము ళ్లు అవకాశం ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలంటూ పదే పదే అడగడం విసుగు పుట్టించింది. ఎంతసేపు తాను అది చేశాను, ఇది చేశాను ఇంకా చేస్తాను అంటూ సొంత బాకా ఊదుకున్నారు. దివంగత సీఎం వైఎస్ హయాంలో హైదరాబాద్‌లో నిర్మిం చిన ఔటర్ రింగురోడ్డు నేనే నిర్మించానని చంద్రబాబు చెప్పడంతో పలువురు ముక్కున వేలేసు కున్నారు.
స్థానిక సమస్యలపై కప్పదాట్లు
నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల, రెండు జూనియర్ కళాశాలలు, నక్కపల్లి ఆస్పత్రిని 50 పడకల స్థాయికి పెంచుతామని నియోజకవర్గంలో మూడుసార్లు పర్యటించినప్పుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. నెలరోజుల్లో నెరవేరుస్తామంటూ ప్రకటించా రు. కానీ అధికారంలోకి ఉండగా నెరవేర్చలేదని మళ్లీ ఎన్నికలు వచ్చేశాయని, మళ్లీ గెలిపిస్తే ఇవన్నీ మంజూ రు చేస్తానని ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఒత్తిడి తెచ్చినా..
చంద్రబాబు రోడ్‌కు జనాన్ని తరలించేందుకు అధికార పార్టీ నేతలు అన్నిరకాలుగా ప్రయత్నించారు. రోడ్‌షోకు రాకపోతే చెక్కులు, సెల్‌ఫోన్లు, పసుపు కుంకుమ నిధులు ఆగిపోతాయని డ్వాక్రా మహిళలను మభ్యపెట్టారు. అయినప్పటికీ జనాన్ని సమీకరించలేకపోయారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనందకుమార్ మాత్రం వేలాది విశాఖ డెయిరీ మజ్జిగ ప్యాకెట్లను రోడ్‌షోకు వచ్చిన వారికి ఉచితంగా పంచిపెట్టారు. ఇలా కోడ్ ఉల్లంఘనకు వచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment