హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం చంద్రశేఖర్‌రావు కాదు.. కాళరాత్రి చంద్రశేఖర్‌రావు అని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ విమర్శించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా తిరగబడ్డ తెలంగాణ ధూంధాం కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. ఆదివారం ఇక్కడ తెలంగాణ సాంస్కృతిక సైన్యం రాష్ట్ర కన్వీనర్ గుండమల్ల శ్రీనివాస్ తెలంగాణ ఇంటి పార్టీలో చేరారు.
సుధాకర్ మాట్లాడుతూ ‘సీఎం జాతీయ చానెల్‌ను పిలిపించుకొని గొప్పలు చెప్పుకోవడం కాదు, రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల సమస్యలపై అదే చానెల్‌లో బహిరంగంగా చర్చించడానికి సిద్ధమా’అని సవాల్ విసిరారు. మంద కృష్ణమాదిగను అరెస్ట్ చేయడం అన్యాయమని, ఆయన విడుదలకై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని పారదోలేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సామాజిక వర్గాల అధికారం, అభివృద్ధి కోసం కృషిచేసేవారితో కలసి పనిచేసేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.
ప్రభుత్వతీరును నిరసిస్తూ కళాకారులు చేపట్టే సాంస్కృతిక ప్రదర్శనలకు తమ మద్ధతు ఎప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక సభ్యులు, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి దొమ్మాట వెంకటేశ్, తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్, రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ మాదిగ, యువజన విభాగం అధ్యక్షుడు గుర్రం సంతోశ్‌రెడ్డి, నాయకులు గౌని నర్సింహగౌడ్, దేవేందర్‌రెడ్డి, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment