సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాక్షసానందం పొందుతూ పౌర చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదని కేంద్రానికి స్పష్టం చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో సోమవారం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భిన్న స్వరూపం, వందల ఏళ్ల కాస్మోపాలిటిన్ కల్చర్, భిన్న సంస్కృతులకు ఆలవాలంగా ఉన్న తెలంగాణ సీఏఏపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ పౌరసత్వ చట్టంపై గత కొద్ది రోజులుగా అనేక వర్గాలు వారి వారి పద్ధతుల్లో నిరసనలు తెలియజేశాయని కేసీఆర్ గుర్తు చేశారు. సీఏఏపై పార్లమెంట్‌లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చెప్పామని అన్నారు.
(చదవండి: ఎన్పీఆర్‌పై అనుమానాలొద్దు: అమిత్ షా)
దేశంలో ఇప్పటికే ఏడు రాష్ట్రాలు.. కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయని, తమది ఎనిమిదో రాష్ట్రమని సీఎం తెలిపారు. ఆందోళనలను సృష్టిస్తున్న సీఏఏని పునఃసమీక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీకర్ ద్వారా కేంద్రాన్ని కోరారు. సీఏఏను తాము గుడ్డిగా వ్యతిరేకించడం లేదని, అన్నీ అర్థం చేసుకొని పూర్తిగా ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడి ఢిల్లీ పర్యటన సందర్భంగా అనేక మంది చనిపోయారని, కేంద్ర నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఆయన విమర్శించారు. ఈ దేశానికి సీఏఏ అవసరం లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు.
‘సీఏఏ అమలు తప్ప దేశంలో వేరే సమస్యే లేదన్నట్టు, ఏదో కొంపలు మునిగినట్టు ఇదొక్కటే సమస్య అన్నట్టు కేంద్రం ప్రవర్తిస్తోంది. ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, దేశ సమస్య. నాకే బర్త్ సర్టిఫికెట్ లేదని ఇదివరకే చెప్పాను. నా ఒక్కడి పరిస్థితి ఇలా అంటే దేశంలో అనేక మందికి ధ్రువీకరణ పత్రాలు లేవు. నిన్ను ఎవరు బర్త్ సెర్టిఫికెట్ అడిగారు అని నన్ను అంటున్నారు. ఒక్క మాట అడుగుతా సమాధానం చెప్తారా. ఓటర్ ఐడి, ఆధార్, రేషన్ కార్డ్ ఏవీ కూడా పని చేయవని అంటున్నారు. దేశంలో కోట్ల మందికి బర్త్ సర్టిఫికెట్ లేదు వారి పరిస్థితి ఏంటి. దీనికి కేంద్రం సమాధానం చెప్పాలి’ అని సీఎం పేర్కొన్నారు.
(చదవండి: కోర్టు ఆదేశాలు.. అసదుద్దీన్‌పై కేసు నమోదు)
సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తెలంగాణ శాసనసభ సోమవారం ఆమోదించింది. తీర్మానంపై చర్చ అనంతరం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తీర్మానం ఆమోదం తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భోజన విరామం ప్రకటించారు. సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభంకాగానే సీఏఏపై తీర్మానం ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ చర్చను ప్రారంభించారు. అనంతరం అన్ని పార్టీల నేతలు తీర్మానంపై మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment