నల్లగొండపై పక్కా వ్యూహం! | CM KCR focus on Nalgonda | Sakshi
Sakshi News home page

నల్లగొండపై పక్కా వ్యూహం!

Published Wed, Mar 14 2018 3:13 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM

CM KCR focus on Nalgonda - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సార్వత్రిక ఎన్నికలకు ముందు బల నిరూపణకు.. తమ పట్టును ప్రకటించుకునేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పెద్ద వ్యూహాన్ని రచించిందా..? పద్నాలుగేళ్ల ఉద్య మ కాలంలో పార్టీ శ్రేణులు, నాయకుల్లో ఉత్సా హం నింపాల్సి వచ్చిన ప్రతిసారీ ప్రయోగిం చిన ‘ఉప ఎన్నికల’ వజ్రాయుధాన్నే ఇప్పుడూ ప్రయోగిస్తోందా..? నల్లగొండపై టీఆర్‌ఎస్‌ సిద్ధం చేసుకున్న ప్రణాళిక గురించి తెలుసు కుంటే పై ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఆరేడు నెలల కిందట నల్లగొండ ఎంపీ స్థానంలో ఉప ఎన్నిక ప్రయోగం అమలు చేయాలని చూసినా.. వివిధ కారణాలతో టీఆర్‌ఎస్‌ నాయకత్వం వెనకడుగు వేసింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలు వేదికగా గవర్నర్‌ ప్రసంగ సమయంలో సోమవారం సభలో చోటు చేసుకున్న పరిణామాలను టీఆర్‌ఎస్‌ తమకు అనుకూలంగా మార్చుకుంటోందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.  టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి తమకు దక్క కుండా ఊరిస్తున్న నల్లగొండ అసెంబ్లీ స్థానం లో పాగా వేసేందుకు ఎదురుచూస్తున్న టీఆర్‌ ఎస్‌కు మంగళవారం నాటికి ఓ స్పష్టతకు వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విసిరిన హెడ్‌ ఫోన్స్‌  మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి తగిలి గాయమైన నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మరో ఎమ్మెల్యే సంపత్‌ శాసన సభ్యత్వాలను స్పీకర్‌ రద్దు చేయడంతో నల్లగొండలో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటు న్నాయి. 

ముఖ్య నేతలతో అధినేత ఫోన్‌ సంభాషణ?
నల్లగొండ ఎమ్మెల్యేపై చర్య తీసుకోవడం ఖాయమయ్యాక టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ జిల్లా ముఖ్య నాయకులతో మాట్లాడా రని విశ్వసనీయంగా తెలిసింది. ఉప ఎన్నిక అనివార్యమవుతుందని, పూర్తిస్థాయిలో దృష్టి సారించి పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారని సమాచారం. వాస్తవానికి ఉమ్మడి నల్లగొండపై దృష్టి సారించిన పార్టీ అధినాయకత్వం వరుస కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే మున్సిపల్, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ ప్రగతి సభల పేర జిల్లాలో పర్యటిస్తున్నారు. పార్టీ వర్గాలు చెబుతున్న సమాచారం మేరకు ఈనెల 20వ తేదీన నల్లగొండలో కూడా సభ జరగాల్సి ఉంది. ఇప్పటికే శాసనసభ నుంచి రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయని ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో సమీప నెలల్లోనే ఉప ఎన్నిక జరుగుతుందని టీఆర్‌ఎస్‌ నాయకత్వం భావిస్తోంది.

నిరసన కార్యక్రమాలు..
మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌పై దాడికి నిరసనగా సోమవారం కొన్ని నిరసన కార్య క్రమాలు జరిగాయి. అయితే, కాంగ్రెస్‌ ఎమ్మె ల్యేలు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీరును ప్రజ ల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని అధినాయ కత్వం నుంచి అందిన ఆదేశాల మేరకు సోమవారం రాత్రికి రాత్రే కార్యక్రమాలను రూపొందించారు. ప్రధానంగా నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మంగళ వారం పెద్ద ఎత్తున దిష్టిబొమ్మల దహనాలు చేపట్టారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తాలో నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌ రెడ్డి నేతృత్వంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర జరిపారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఇతర ముఖ్య నాయకులంతా పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌ కార్యకర్తల అరెస్టులు
కోమటిరెడ్డి శాసన సభ్యత్వం రద్దు, ఇతర ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు నిరసనగా కాంగ్రెస్‌ శ్రేణులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. దీంతో పోలీసులు ముందస్తు గానే అప్రమత్తమై ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. కాంగ్రెస్‌ నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ నేతలను అరెస్టు చేశారు. మరో వైపు జిల్లా కేంద్రంలో భారీ సంఖ్యలోనే పోలీసులను మోహరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సీఐలు, ఎస్‌ఐలను ఉదయం ఏడు గంటలకల్లా నల్లగొండకు రప్పించారు. ఇక అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇలా, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు పోటా పోటీగా కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో ఉద్రిక్తత నెలకొన్నా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement