
గజ్వేల్ నుంచి పోటీకి సిద్ధం: కోమటిరెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధమని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
నల్లగొండ రూరల్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధమని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అక్కడ తాను విజయం కూడా సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ మండలం కొత్తపల్లిలో ఆదివారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు ప్రాంతాల నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారని, ఈ విషయం ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారని ఎద్దేవా చేశారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. దేశంలోనే ఇంతటి మోసకారి సీఎం లేరని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ బహిరంగ సభకు రూ. 500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.