రేపే కేసీఆర్‌ రాక | CM KCR tour in adilabad district tomarrow | Sakshi
Sakshi News home page

రేపే కేసీఆర్‌ రాక

Published Mon, Feb 26 2018 2:07 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

CM KCR tour in adilabad district tomarrow - Sakshi

ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ఆదిలాబాద్‌: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిమగ్నమయ్యారు. ముందుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోర్టా–చనాఖా బ్యారేజీ వద్దకు చేరుకుని నిర్మాణ పనుల ను పరిశీలిస్తారు. 50 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా మహా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వం ఈ బ్యారేజీ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. స్వయంగా కేసీఆర్‌ ఈ బ్యారేజీ నిర్మాణంపై శ్రద్ధ చూపిస్తుండడం, మొదటిసారిగా అక్కడ జరుగుతున్న పనుల పరిశీలనకు వస్తుం డడం ప్రాధాన్యత సంతరించుకుంది. హెలికాప్టర్‌లో వస్తుండడంతో బ్యారేజీ వద్ద ప్రత్యేక హెలి ప్యాడ్‌ ఏర్పాటు చేశారు. ఉదయం 10.45 గంటలకు హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. సుమారు గంటపాటు అక్కడే ఉండి నిర్మాణ పనులు పరిశీలిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌లోని విమానాశ్రయ మైదానా నికి చేరుకుంటారు. అక్కడి డైట్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ తర్వాత ఇక్కడ భోజనం చేసి శ్రీరాంపూర్‌కు బయల్దేరుతారు. 3:05 గంటలకు మంచిర్యాల జిల్లా సీసీసీ గెస్ట్‌హౌజ్‌కు చేరుకుంటారు. శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియంలో బహిరంగ సభ అనంతరం సింగరేణి కాలనీల్లో సీఎం పర్యటిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారు.

ఏర్పాట్లను పరిశీలించిన చీఫ్‌ విప్, ఎంపీ
సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఆది వారం రామగుండం కమిషనర్‌ విక్రంజిత్‌ దుగ్గ ల్, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ పరిశీలించారు. నస్పూరులో కమిషనరేట్‌కు కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను పరిశీ లించిన అనంతరం ప్రగతి స్టేడియంలో ఏర్పా టు చేయనున్న బహిరంగ సభ ప్రాంగణం, సింగరేణి కార్మికుల కుటుంబాలతో సీఎం మాట్లాడే కాలనీలను సందర్శించారు. కేసీఆర్‌ సభకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేసిన సీపీ, జిల్లా కలెక్టర్‌లు ఆదివారం సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సింగరేణి అధికారులతో కలిసి రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఆదివారం సాయంత్రం ఎంపీ బాల్క సుమన్, చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్, కలెక్టర్, సింగరేణి డైరక్టర్లు పవిత్రన్‌ కుమార్, చంద్రశేఖర్, జీఎం సుభాణి, ఎమ్మెల్యే దివాకర్‌రావు నస్పూరు కాలనీ, షిర్కే కాలనీలో సీఎం పర్యటన నిమిత్తం కాలనీల్లో పర్యటించి, పరిశీలించారు.

హామీలపైనే ఆశలు
సింగరేణి ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ కార్మికులకు హామీలిచ్చిన అనంతరం మొదటిసారిగా వస్తున్నారు. కార్మికుల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. కార్మికుల కాలనీలో సందర్శన చేయనుండగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారసత్వ ఉద్యోగాల స్థానంలో కారుణ్యనియామకాలు చేస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదు. దీంతో ఎంతో మంది కార్మికులు ఎదురు చూస్తున్న ఈ ప్రధానహామీపై సీఎం స్పందన ఎలా ఉం టుందోనని సింగరేణి వర్గాల్లో చర్చసాగుతోంది. సొంత ఇంటి నిర్మాణం కోసం వడ్డీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణానికి సంబంధించి ఇటీవల ఆదేశాలు జారీ చేయడం, సింగరేణి కార్మికుల క్వార్టర్లకు ఏసీలు పెట్టుకునేందుకు విద్యుత్‌ లైన్‌ వేస్తుండగా, ప్రతి ఒక్కరి దృష్టి కారుణ్య నియామకాలపైనే ఉంది.

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి రామన్న
సీఎం పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్‌లోని డైట్‌ మైదానంలో బహిరంగ సభ, విమానాశ్రయ మైదానం, జైనథ్‌లోని కోర్టా–చనాఖా బ్యారేజీ వద్ద ఏర్పాట్లను రాష్ట్ర అటవీ, బీసీ శాఖ మంత్రి జోగు రామన్న, ఆదిలాబాద్‌ కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ ఆదివారం పరిశీలించారు. టీటీడీసీ గెస్ట్‌హౌస్‌ను పరిశీలించి ఏర్పాట్లపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోర్టా–చనాఖా వద్ద హెలిప్యాడ్, ఇతర ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్, జేసీ కృష్ణారెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రంగినేని మనీషా, కమిషనర్‌ మారుతి ప్రసాద్, నిర్మల్‌ అదనపు ఎస్పీ ఎస్‌.దక్షణమూర్తి, ఆదిలాబాద్‌ శిక్షణ కేంద్రం అదనపు ఎస్పీ కంచ మోహన్, డీఎస్పీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా 1200 మంది పోలీసులతో బందోబస్తు ప్రణాళిక సిద్దం చేసినట్లు ఎస్పీ తెలిపారు.

జన సమీకరణలో నేతలు బిజీ  
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభకు జనసమీకరణ కోసం టీఆర్‌ఎస్‌ నేతలు బిజీగా మారారు. సీఎం మొదటిసారి ఆదిలాబాద్‌కు రానుండడంతో పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మంత్రి జోగు రామన్న పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి బహిరంగ సభ విజయవంతం చేయడంపై చర్చించారు. ఆదిలాబాద్‌ పట్టణంతో పాటు, గ్రామీణా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సభకు ప్రజలను తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.   

భారీ బందోబస్తు..
జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ టూర్‌ ఖరారు కావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే బహిరంగ సభ జరిగే డైట్‌ మైదానం, హెలీప్యాడ్‌ ప్రాంతం, డీఆర్‌డీఏ విశ్రాంతి భవనంలో బందోబస్తు ఏర్పాట్లును ఆదివారం పరిశీలించారు. అంతకు ముందు ఉదయం కోర్టా– చనాఖా బ్యారేజీ వద్ద హెలీప్యాడ్‌ ఏర్పాట్లను డీఆర్‌డీఓ రాజేశ్వర్‌ రాథోడ్, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఎస్పీ నర్సింహారెడ్డితో కలిసి పరిశీలించారు. బ్యారేజీ చుట్టు పక్కల సాయుధ బలగాలతో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా 1200 మంది పోలీసులతో బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎస్పీ తెలిపారు. ముందస్తుగా కేసీఆర్‌ పర్యటించే ప్రాంతాలను పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. సీఎం పర్యటన కోసం అదనపు ఎస్పీలు నలుగురు, డీఎస్పీలు ఎనిమిది మంది, సీఐలు 25 మంది, ఎస్సైలు–55, ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుళ్లు– 221, కానిస్టేబుళ్లు –402, మహిళ పోలీ సులు–112, హోంగార్డులు–170, ప్రత్యేక సాయుధ బలగాలు–100 మంది విధుల్లో పాల్గొననున్నారు. వీరితో పాటు నిఘా పర్యవేక్షణ, 20 మంది పోలీసులు వీడియో చిత్రీకరణతో పాటు బాంబ్‌స్క్వాడ్‌ బృందాలతో ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. కేసీఆర్‌ రాక సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు. బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఎస్పీతో పాటు నిర్మల్‌ అదనపు ఎస్పీ ఎస్‌. దక్షణ మూర్తి, ఆదిలాబాద్‌ శిక్షణ కేంద్రం అదనపు ఎస్పీ కంచ మోహన్, డీఎస్పీ నర్సింహారెడ్డిలు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement