
అమెరికా పర్యటనకు బయల్దేరిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు.
వాషింగ్టన్ : అమెరికా పర్యటనకు బయల్దేరిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రవాసాంధ్రులు ఆయనకు డ్యూలస్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. అదే విధంగా భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు అరుణీశ్ చావ్లా(ఐఏఎస్), నీల్‌కాంత్ అవ్హద్(ఐఏఎస్) కూడా సీఎం జగన్‌ను సాదరంగా ఆహ్వానించారు. కాగా వందలాదిగా తరలివచ్చిన ఎన్నారైలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇక అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం నుంచి అమెరికా- ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ కానున్నారు. అనంతరం భారత రాయబారి ఆహ్వానం మేరకు సీఎం జగన్ విందులో పాల్గొంటారు. ఇదిలా ఉండగా.. అమెరికా పర్యటనలో మూడు రోజులు వ్యక్తిగత పనులు ఉండటం వల్ల సీఎం జగన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులూ తీసుకోకుండా తానే స్వయంగా ఖర్చులు భరించనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం రాత్రి వెల్లడించింది.
చదవండి: బహుదూరపు బాటసారి అమెరికాయానం...
సీఎం జగన్ పర్యటన వివరాలు
♦ ఆగస్టు 16, ఉదయం 8:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు) వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. అనంతరం అమెరికా రాయబారితో, అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత అమెరికాలో భారత రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొంటారు.
♦ ఆగస్టు 17 మధ్యాహ్నం 2 గంటలకు (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు) డల్లాస్ చేరుకుంటారు. అక్కడి కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) నార్త్ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని వారినుద్దేశించి ప్రసంగిస్తారు.
♦ ఆగస్టు 18న వాషింగ్టన్ డీసీలో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు.
♦ ఆగస్టు 19, 20, 21 తేదీల్లో వ్యక్తిగత పనుల్లో ఉంటారు.
♦ ఆగస్టు 22న మధ్యాహ్నం షికాగోలో మరికొందరు ప్రతినిధులను కలుస్తారు. అదే రోజు రాత్రి 8:30 గంటలకు రాష్ట్రానికి బయల్దేరతారు.
వాషింగ్టన్ డీసీ చేరుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్, స్వాగతం పలికిన భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు pic.twitter.com/b8OGYUnk29
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 16, 2019