అవినీతి రహిత, పారదర్శక ప్రభుత్వం మాది | CM YS Jagan Meet With US India Business Council Representatives In Washington DC | Sakshi
Sakshi News home page

అవినీతి రహిత, పారదర్శక ప్రభుత్వం మాది

Published Sat, Aug 17 2019 12:49 AM | Last Updated on Sat, Aug 17 2019 1:24 PM

CM YS Jagan Meet With US India Business Council Representatives In Washington DC - Sakshi

శుక్రవారం అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జరిగిన యూఎస్‌–ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

వాషింగ్టన్‌ డీసీ: అవినీతి రహిత, పారదర్శక ప్రభుత్వం తమదని, రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. తమ రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే కేవలం ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందని, తన కార్యాలయమే దగ్గరుండి అన్ని పనులూ చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ మానిటరింగ్‌ అథారిటీ (ఇప్మా) పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు చేదోడువాదోడుగా ఉంటుందని అన్నారు. వారికి చేయూతనిచ్చి నడిపించడమే కాకుండా.. పరిశ్రమలకు అవసరమైన భూములు, విద్యుత్, నీరు సమకూర్చిపెడుతుందని వివరించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ (డీసీ)లో యూఎస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కీలక సమావేశానికి సీఎం హాజరయ్యారు. అక్కడ భారత రాయబారి హర్షవర్ధన్‌ ష్రింగ్లాతో సీఎం సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. యూఎస్‌ – ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్‌కు విశాల సముద్ర తీరం ఉందని, కొత్తగా పోర్టులు నిర్మిస్తున్నామని, వీటిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఉప్పునీటిని మంచినీరుగా మార్చడం, మెట్రో రైళ్లు, బకింగ్‌హామ్‌ కెనాల్‌ పునరుద్ధరణ, ఎలక్ట్రికల్‌ బస్సులు, వ్యవసాయ స్థిరీకరణ, నదుల అనుసంధానం, వ్యవసాయ రంగంలో పరిశోధనలు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ విస్తరణ, ఆక్వా ఉత్పత్తుల విస్తృతికి మార్కెట్‌లో అపార అవకాశాలున్నాయన్నారు. నాణ్యత, అధిక దిగుబడులు సాధించడానికి తాము చేసే ప్రయత్నాల్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. తాము ప్రాధాన్యతలుగా చెబుతున్న రంగాలన్నింటిలో పర్యావరణ హితం ఉంటుందన్నారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో తమకు చక్కటి సంబంధాలున్నాయని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌లో బలమైన నాయకత్వం ఉంది: రాబ్‌ ష్రోడర్‌
యూఎస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాబ్‌ ష్రోడర్‌ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ఇటీవల ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనవిజయాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడ్డ బలమైన నాయకత్వం అమెరికా– ఆంధ్రప్రదేశ్‌ మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవాలన్న భారత్‌ ఆకాంక్షకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని వ్యాఖ్యానించారు. యూఎస్‌లో భారత రాయబారి హర్షవర్ధన్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ఘనవిజయం సాధించారని, ఇంత మెజార్టీ రావడం చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సంస్థలు, వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ సరైన రాష్ట్రమని పేర్కొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పీవీ రమేష్‌ కొన్ని కీలక అంశాలను వివరించారు. గోదావరి – కృష్ణా నదుల అనుసంధానం, కడపలో స్టీల్‌ ప్లాంట్, కోస్తా తీరంలో రిఫైనరీ ప్రాజెక్టు, బకింగ్‌హామ్‌ కెనాల్‌ పునరుద్ధరణ, తదితర కీలక ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలుగా చేసుకుందన్నారు. పాదయాత్ర ద్వారా వైఎస్‌ జగన్‌ 2.2 కోట్ల మంది ప్రజలను స్వయంగా కలుసుకుని సమగ్ర మానవాభివృద్ధికి అవసరమైన అంశాలను గుర్తించి, వాటిని అమలుచేస్తున్నారని చెప్పారు. అవినీతి రహిత, పారదర్శక ప్రభుత్వాన్ని అందించడానికి అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. 

(చదవండి : సీఎం జగన్‌కు అమెరికాలో ఘన స్వాగతం)

ముఖ్యమంత్రికి ఘనస్వాగతం
వారం రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్‌ అక్కడి కాలమానం ప్రకారం.. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు) వాషింగ్టన్‌ డీసీలోని డుల్లెస్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో భారత రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారులు అరుణిష్‌ చావ్లా, నికాంత్‌ అవహద్‌ ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, తెలుగు సంఘాల ప్రతినిధులు సీఎంకి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. 

స్టాండింగ్‌ కమిటీలో సీఎం వైఎస్‌ జగన్‌కు చోటు 
న్యూఢిల్లీ: రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాల దర్యాప్తు, సలహాల కోసం ఉద్దేశించిన అంతర్రాష్ట్ర మండలి స్టాండింగ్‌ కమిటీలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చోటు లభించింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షుడిగా ఉండే 13 మందితో కూడిన స్టాండింగ్‌ కమిటీలో నలుగురు బీజేపీయేతర ముఖ్యమంత్రులు నామినేట్‌ అయ్యారు. వారిలో నవీన్‌పటా్నయక్‌ (ఒడిశా), నితీశ్‌కుమార్‌ (బిహార్‌), అమరేందర్‌ సింగ్‌ (పంజాబ్‌)లతో పాటుగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నారు. తాజాగా అంతర్రాష్ట్ర  మండలిని పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

ఇందులో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అధికార విభాగాలు కూడా ఈ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉంటారు. వీరంతా కేంద్ర రాష్ట్ర సంబంధాలు, నిర్ణయాలపై నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కౌన్సిల్‌లో సమస్యలను ప్రస్తావిస్తారు.  ఈ స్టాండింగ్‌ కమిటీలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు శర్బానంద్‌ సోనోవాల్‌ (అసోం), విజయ్‌ రూపాణీ (గుజరాత్‌), దేవేంద్ర ఫడ్నవిస్‌ (మహారాష్ట్ర), యోగి ఆదిత్యనాథ్‌ (ఉత్తర ప్రదేశ్‌)లతో పాటుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్‌ తోమర్, తావర్‌ చంద్‌ గెహ్లోత్, గజేంద్రసింగ్‌ షెకావత్‌లు చోటు దక్కించుకున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement