సాక్షి, అమరావతి : ప్రత్యేకహోదా ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలేకాదు.. ప్రతి ఉద్యోగి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని తెలిపారు. మంగళవారం కలెక్టర్ల రెండో రోజు సదస్సులో భాగంగా జిల్లా ఎస్పీలు, పోలీస్ ఉన్నతాధికారులనుద్దేశించి ప్రసంగించారు. ‘ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి. దేశంలోనే ఏపీ పోలీస్ వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉండాలి. చట్టాలను అమలు చేయడంలో ఎమ్మెల్యేలను కలుపుకుని పోవాలి. మానవీయ కోణంలో పోలీసులు పనిచేయాలి. ప్రజాప్రతినిధులను గౌరవించాలి. తప్పు చేస్తే ఎవరైనా ఎంతటివారైనా సహించవద్దు. పాలనా వ్యవస్థలో పోలీసులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమే. చెడ్డపేరు వచ్చే పని ఎవరూ చేయవద్దు. పర్సనల్ ఇగోలు పక్కనపెట్టి పనిచేయండి.
కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై ఎన్ని కేసులు నమోదయ్యాయి?
గత సీఎం నివాసం సమీపంలో ఇసుక మాఫియా సాగింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక దోపిడీ అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోపై ఓ ప్రజాప్రతినిధి జుట్టు పట్టుకుని దాడి చేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా మన కళ్ల ఎదుటే జరిగాయి. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది సరైన విధానమేనా? గుంటూరు జిల్లాలో అక్రమమైనింగ్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? భూ సమీకరణ పేరుతో పోలాలు ఇవ్వని రైతులపై అక్రమ కేసులు పెట్టారు. ఎమ్మెల్యేలే బహిరంగంగా దందాలకు పాల్పడ్డారు. గ్యాంబ్లింగ్, పేకాట క్లబ్‌లకు ఎమ్మెల్యేలు సహకరించారు. ఇలాంటి ఘటనలపై చర్యలు లేకుంటే నంబర్‌వన్ పోలీస్ ఎలా అవుతుంది. విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై ఎన్ని కేసులు నమోదయ్యాయి. ఎంత మందిని అరెస్ట్ చేశారు. మనమంతా కూర్చున్న ఈ వేదిక అక్రమ కట్టడమే. ఈ విషయం నిన్న కూడా చెప్పా. ఈ నిర్మాణం అక్రమమని జలవనరుల శాఖ నివేదిక కూడా ఇచ్చింది. మన కళ్లెదుటే మాజీ సీఎం అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్నారు. ప్రభుత్వమే అక్రమ కట్టడాలను నిర్మిస్తే ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్టు? ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి.
మంచి పాలనపై మీరు తీసుకునే నిర్ణయాల పట్ల నా పూర్తి సహకారం ఉంటుంది. అప్పుడే సుపరిపాలన అందించగలం. ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని మా నాన్న నేర్పించారు. నేను కూడా అదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. దేశంలోనే తొలిసారిగా ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీఆఫ్ అందించాలని నిర్ణయించాం. కుటుంబంతో గడపాల్సిన అవసరం పోలీసులకు ఉంది. దీనివల్ల మరింత ఉత్తేజంతో వారు విధుల్లోకి వస్తారు. డిపార్ట్‌మెంట్‌లో దిగువస్థాయికీ దీన్ని వర్తింపచేయండి. పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఫిర్యాదుదారులను గౌరవించేలా రిసెష్షన్ విభాగం ఉండాలి.
ఎస్పీలు ఆకస్మీక తనిఖీలు చేయాలి
నిన్న కలెక్టర్లకు డిస్ట్రిక్ పోర్టల్ ప్రారంభించమని చెప్పాను. అందులో ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, లైసెన్స్‌లు, అనుమతులు ఇలాంటివన్నీ పెట్టమని చెప్పాను. వేగం, పారదర్శకత కోసమే ఈ విధానం. పోలీసులకు పనితీరుకు సంబంధించి నివేదిక ఉండాలి. థర్డ్‌పార్టీ ఇది చూడాలి. అవినీతిని పూర్తిగా నిర్మూలించాలి. పోలీసు అధికారుల పనితీరుపై బాధితులు, ప్రజల నుంచి మనం ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. మండల స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకూ గ్రీవెన్స్ సెల్ నిర్వహించాలని నిన్నే కలెక్టర్లకు చెప్పాం. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పాం. ప్రతి గ్రీవెన్స్‌కు రశీదు ఇచ్చి, వారి ఫోన్ నంబర్‌ను తీసుకోమన్నాం. ఇలాంటి విధానమే పోలీసు వ్యవస్థలో కూడా అమలు చేయాలి. విశ్వసనీయత, పారదర్శకత, సమస్యల పరిష్కారంలో వేగం ఉండాలి. ఎస్పీలు కూడా గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలి, ప్రజలతో మమేకంకావాలి. గ్రామాల్లో బలహీన వర్గాలు, ఎస్సీల కాలనీలకు వెళ్లి.. పోలీసుల తీరుపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి.
సైబర్ కేసులను పూర్తిగా అడ్డుకోలేకపోతున్నామన్న అభిప్రాయం ఉంది. మహిళల హక్కులను మనం కాపాడాలి. సైబర్ హెరాస్‌మెంట్‌ను కఠినంగా అణచివేయాలి. వీలైతే అధికారుల అందరికీ శిక్షణ ఇవ్వాలి. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారో చూడాలి. సామాజిక అసమానతను నిర్మూలించాలి. ఈవ్‌టీజింగ్ పట్ల కఠినంగా ఉండాలి. మంచి ప్రభుత్వం, మంచి పాలన, సరైన విధానాలు, నంబర్‌ఒన్ పోలీసింగ్‌కోసం మనం కృషిచేయాలి’ అని వైఎస్ జగన్ పలు సూచనలు చేశారు.
చదవండి: పాలకులం కాదు.. సేవకులం
కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై సీఎం జగన్ సీరియస్
Comments
Please login to add a commentAdd a comment