
తాగునీటి సమస్యపై ఎంపీ అభ్యర్థి జేసీ పవన్‌కుమార్‌రెడ్డిని చుట్టుముట్టిన మహిళలు
సాక్షి, గుంతకల్లు: ‘‘ఎన్నికలప్పుడు వస్తారు. అవి చేస్తాం.. ఇవి చేస్తామంటూ నమ్మిస్తారు. చేసిందేమీ లేదు. ఐదేళ్లుగా తాగునీళ్లివ్వమని అడుగుతున్నాం. ఒక్కరూ పట్టించుకోలేదే. ఉమామహేశ్వరనగర్, కాల్వగడ్డ, గంగానగర్ తదితర ప్రాంతాల్లో తాగునీళ్లు రావడం లేదు. నెలనెలా కుళాయి, ఇంటి గుత్తలు సక్రమంగా కడుతున్నాం. అయినా నీళ్లు ఇవ్వడం లేదు. ఎండాకాలం మా పరిస్థితి దేవునికే తెలుసు. రోజూ నీళ్లకే రూ.50 దాకా ఖర్చవుతోంది.
ఇవన్నీ మీకు పట్టవు.. ఇప్పుడు ఓట్ల కోసం ఏ ముఖం పెట్టుకుని వచ్చారు.’’ అంటూ మహిళలు టీడీపీ పాలనను తూర్పారబట్టారు. దీంతో అట్టహాసంగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ ఎంపీ అభ్యర్థి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి బిక్కచచ్చిపోయారు. మంగళవారం ఆయన గుంతకల్లు పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేశారు. హనుమేష్‌నగర్‌లో పర్యటిస్తుండగా మహిళలు అడ్డుకున్నారు. ఐదేళ్లలో ఏం చేశారో చెప్పాలని నిలదీయగా.. జేసీ పవన్ నీళ్లు నమిలారు. ఏడాది కాలంగా అనంతపురం పార్లమెంటు పరిధిలోని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించానన్నారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామంటూ అక్కడి నుంచి జారుకున్నారు.
ఏనాడూ మా కాలనీకి రాలేదు ..
ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ 2014 ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వచ్చారు. గెలిచిన తర్వాత ఐదేళ్లలో ఏనాడూ మా కాలనీకి రాలేదు. మా సమస్యలు విన్నదీ లేదు. 2019 ఎన్నికలు రావడంతో మీ సమస్యలు పరిష్కారం చేస్తామంటూ రావడం నవ్వులాటగా ఉంది.
– శోభ, సీఐటీయూ కాలనీ