కాళ్లు మొక్కినా.. ఆత్మభిమానం తాకట్టు పెట్టినా! | Gummanur Jayaram No Chance On TDP Ticket | Sakshi
Sakshi News home page

కాళ్లు మొక్కినా.. ఆత్మభిమానం తాకట్టు పెట్టినా!

Published Sat, Mar 23 2024 8:55 AM | Last Updated on Sat, Mar 23 2024 9:52 AM

Gummanur Jayaram No Chance On TDP Ticket - Sakshi

‘గుమ్మనూరు’కు మూడో జాబితాలో మొండిచేయి 

గుంతకల్లు టిక్కెట్‌పై ఇప్పటి వరకు ఆశలు 

అక్కడి స్థానిక నేతల నుంచి లభించని మద్దతు 

ఐవీఆర్‌ఎస్‌ సర్వేలోనూ అనుకూలత లేదనే చర్చ 

తెరపైకి చంద్రబాబు మార్కు మోసం 

చేతులు కాల్చుకున్నామని గుమ్మనూరులో ఆవేదన 

ఆలూరు టిక్కెట్‌ కోరుతున్నా ససేమిరా 

ఇప్పటికే మంత్రాలయం వాల్మీకులకు ఇచ్చామనే వాదన  

రెండుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్టు.. ఐదేళ్లు మంత్రి పదవి, ఈ దఫా ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టిక్కెట్‌.. ఇదీ గుమ్మనూరు జయరాంకు వైఎస్సార్‌సీపీ ఇచ్చిన ప్రాధాన్యత. బోయ సామాజిక వర్గం కావడంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారు. బోయలు పల్లకీలు మోయడానికి మాత్రమే కాదని.. రాజకీయంగానూ ఎదగాలనే ఉద్దేశంతో గుమ్మనూరుకు పార్టీ అవకాశం కల్పిస్తూ వచ్చింది. ఇదే సమయంలో జిల్లాలో మరికొందరికి కూడా రాజకీయ ఎదుగుదలకు దారులు వేసింది. అలాంటి పార్టీని గుమ్మనూరు జయరాం స్వార్థ ప్రయోజనాల కోసం కాదనుకున్నారు. బీసీలను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పంచన చేరి ఏకంగా కాళ్లు మొక్కడం ద్వారా, బోయల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు. టిక్కెట్‌ విషయానికొచ్చే సరికి చంద్రబాబు అసలు నైజం బయటపడింది. గుమ్మనూరు కోరుకున్న గుంతకల్లు విషయంలో మూడో విడత జాబితాలోనూ చోటు దక్కకపోవడం, కనీసం ఆలూరునైనా ఇస్తారనుకుంటే ఇప్పటికే మంత్రాలయం బోయలకు ఇవ్వడంతో టీడీపీలో చేరిన ఫలితం అనుభవిస్తున్నాడని ఆయన వర్గీయుల్లో చర్చ జరుగుతోంది.

సాక్షి ప్రతినిధి కర్నూలు: తెలుగుదేశంపార్టీ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాను శుక్రవారం టీడీపీ ప్రకటించింది. అందులో గుమ్మనూరు జయరాం పేరు లేదు. టీడీపీలో చేరికకు ముందు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పారీ్టకి రాజీనామా చేసే సమయంలో గుంతకల్లు టిక్కెట్‌ తనకు ఇస్తామని చంద్రబాబు చెప్పారని, గుంతకల్లు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానని విలేకరుల సమావేశంలో జయరాం వెల్లడించారు. మంత్రిగా ఉండి పారీ్టలో చేరడంతో గుంతకల్లు టిక్కెట్‌ వస్తుందనే భావనలోనే అంతా ఉన్నారు. 

అయితే గుంతకల్లు అభ్యరి్థని ఖరారు చేసేందుకు చంద్రబాబు చేపట్టిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో జయరాంకు ప్రతికూలంగా ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. పైగా గుంతకల్లు టీడీపీ నేతలు స్థానికేతరుడిని తమపై రుద్దడం ఏంటని, జిల్లాలో ఎప్పుడూ లేని సంప్రదాయం తీసుకొస్తున్నారని వాపోయారు. గుంతకల్లు, గుత్తి, పామిడి నేతలతో పాటు అనంతపురం జిల్లాలోని టీడీపీ మాజీ ఎమ్మెల్యేల నుంచి కూడా జయరాంకు మద్దతు లభించలేదని సమాచారం. పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు జితేంద్రగౌడ్‌కు పూర్తిగా మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. రాయదుర్గం అభ్యరి్థగా కాల్వ పోటీ చేయబోతున్నారు.

 గుంతకల్లులో జయరాంకు టిక్కెట్‌ ఇస్తే వాలీ్మకుల్లో మరో పవర్‌ సెంటర్‌గా, తనకు ప్రత్యామ్నాయంగా జయరాం ఉండొచ్చనే ఆలోచనతో కాల్వ పూర్తిగా జితేంద్రకు మద్దతు ఇస్తున్నట్లు చర్చ జరుగుతోంది. జయరాంను వ్యతిరేకిస్తూ జితేంద్ర చేపట్టిన ర్యాలీలో కూడా భారీగా కార్యకర్తలు హాజరయ్యారు. అయితే గుంతకల్లు టిక్కెట్‌ ఇస్తే రూ.50కోట్ల వరకూ పెట్టుకుంటానని గుమ్మనూరు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. దీంతో చివరి నిమిషంలో ‘డబ్బు మూటల’ బరువు పెరిగి తనకు టిక్కెట్‌ వస్తుందనే ఆశతోనే జయరాం ఉన్నారు. ఇప్పటికైతే జయరాం అభ్యరి్థత్వాన్ని చంద్రబాబు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. 

ఆలూరు టిక్కెట్‌పైనే ఆశలు 
గుంతకల్లు ద్వారాలు దాదాపు మూసుకుపోయాయనే భావనలో జయరాం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోనే ఆలూరు టిక్కెట్‌ తనకు ఇవ్వాలని పట్టుదలగా ఉన్నారు. ఇందుకు కోట్ల సుజాతమ్మ మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. టిక్కెట్‌ విషయంలో తనకు సహకరిస్తే, ఆ ‘రుణం’ తీర్చుకుంటానని జయరాం చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రాలయం టిక్కెట్‌ వాలీ్మకి సామాజిక వర్గానికి చెందిన రాఘవేంద్రకు ఇవ్వడంతో మరో టిక్కెట్‌ ఇవ్వలేమని టీడీపీ స్పష్టం చేసినట్లు చర్చ జరుగుతోంది. అయితే జయరాం మాత్రం గుంతకల్లు, ఆలూరులో ఏదో ఒక టిక్కెట్‌ ఇవ్వాలని నమ్మించి మోసం చేయడం సరికాదనే ఆవేదనలో ఉండటం గమనార్హం.  

 ఎరక్కపోయి వచ్చి.. 
చంద్రబాబు మాత్రం పార్టీ కోసం పనిచేయాలని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని గుమ్మనూరు జయరాంకు  చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రిగా ఉండి, టిక్కెట్‌ ఇస్తామని చెప్పి ఇవ్వలేనపుడు రేపు అధికారంలోకి వస్తే తనకేం న్యాయం చేస్తారనే భావనలో గుమ్మనూరు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. పైగా తాను టీడీపీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో రాలేదని, ఆలూరుపై పట్టు కోల్పోకూడదనే భావనతోనే వచ్చానని, గుంతకల్లు టిక్కెట్‌ తనకు, ఆలూరులో తాను ప్రతిపాదించిన వ్యక్తికి టిక్కెట్‌ ఇస్తామని చెప్పి, ఇప్పుడు మాట తప్పుతున్నారని టీడీపీ ముఖ్యనేతలతో గుమ్మనూరు గట్టిగానే మాట్లాడినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement