
సాక్షి, న్యూఢిల్లీ : విద్యుత్తు ప్రాజెక్టుల స్థాపనలో ఈపీఎస్ కాంట్రాక్టుల అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన మన్నవరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో విస‍్తరించి త‍్వరగా పూర్తిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజ‍్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన శనివారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతెను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
వినతిపత్రంలోని వివరాలు ఇలా ఉన్నాయి.... మొదటి విడతలో రూ.1,200 కోట్లతో, రెండో విడతలో రూ.4,800 కోట్లతో మన్నవరం ప్రాజెక్టును స్థాపించాలని 2008లో ఎన్‌టీపీసీ, బీహెచ్‌ఈల్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్‌టీపీసీ, బీహెచ్‌ఈల్ పవర్ ప్రాజెక్టు ప్రయివేటు లిమిటెడ్(ఎన్‌బీపీపీఎల్) ఏర్పడింది. కానీ కేంద్రం తొలి విడతగా రూ.1,200 కోట్లు వెచ్చించకుండా కేవలం రూ.364 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఇందులో కూడా కేవలం రూ.1,27 కోట్లు మాత్రమే ఇచ్చింది. విద్యుత్తు రంగానికి డిమాండ్ తగ్గిందని, సామర్థ్యానికి మించి విద్యుత్తు ప్రాజెక్టులు ఉన్నాయన్న ప్రచారం సరైనది కాదు. విద్యుత్ రంగానికి అవసరమైన యంత్రాలు, విభాగాలను వివిధ సంస్థలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. అలాంటప్పుడు డిమాండ్ లేదని, సామర్థ్యానికి మించి విద్యుత్ సంస్థలు ఉన్నాయని ఎలా చెప్పగలం?. పైగా దేశంలో విద్యుత్తు రంగ యంత్రాలు, విడిభాగాల తయారీ తగ్గిపోతోంది. ఎన్‌బీపీపీఎల్ ఈ కొరతను తీర్చాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం విద్యుత్తు రంగ పరికరాల తయారీకి ఉద్దేశించినది మాత్రమే కాకుండా దేశంలోని, ఇతర దేశాల్లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన యంత్రాలు తయారు చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు ఇది. కానీ ఎన్‌బీపీపీఎల్ ఈ విషయంపై ఎందుకు దృష్టిపెట్టడం లేదో అర్థం కాని పరిస్థితి. పైగా ఈ ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీ వైదొలిగినట్టు తెలుస్తోంది.. కారణమేంటో తెలియదు. విభజన అనంతరం నూతన ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క కేంద్ర పబ్లిక్ సెక్టార్ యూనిట్ కూడా మిగలలేదు. ఉన్న ఒక్క ఈ ఆశనూ కేంద్రం తుంచివేస్తోంది. ఈ వైఖరి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి. అందువల్ల మీరు స్వయంగా దీనిపై దృష్టిపెట్టి పూర్తిస్థాయిలో పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టును అభివృద్ధి పరచాలని కేంద్ర మంత్రిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment