న్యూఢిల్లీ : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా స్మృతి ఇరానీ గురించిన చర్చే నడుస్తుంది. విద్యార్హతల విషయంలో తప్పుడు వివరాలు పొందిపర్చినట్లు నిరూపణ కావడంతో విపక్షాలు స్మృతి ఇరానీపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. 2004 ఎన్నికల్లో స్మృతి ఇరానీ తాను 1996లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందినట్టు పేర్కొన్నారు. తీరా 2014లో అమేథీ నుంచి బరిలో నిలిచిన సమయంలో బీకామ్ కోసం 1994లో ఢిల్లీ యూనివర్సిటీ దూర విద్యలో ప్రవేశం పొందినట్టు తెలిపారు. ఈ సారి అమేథీ నుంచి దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో తాను గ్రాడ్యూయేషన్ పూర్తి చేయలేదని వెల్లడించారు.
అయితే 2014 ఆగస్టులో ఓ మీడియా సమావేశంలో స్మృతి మాట్లాడుతూ.. తాను ప్రతిష్టాత్మక యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందినట్టు చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు ఆ డిగ్రీ వివరాలు ఎందుకు ఆఫిడవిట్‌లో పొందుపర్చలేదని ప్రతిపక్షాలు స్మృతిని ప్రశ్నించాయి. స్మృతి ఇరానీ తన విద్యార్హత విషయంలో తప్పుదారి పట్టించిందని ఢిల్లీ హైకోర్టులో కేసు కూడా నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఆఫిడవిట్‌లో స్మృతి డిగ్రీ పూర్తి చేయలేదని పేర్కొనడంపై విపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. మంత్రి పదవి మారినట్టుగానే డిగ్రీలు కూడా మారతాయా అని విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓ అడుగు ముందుకేసి ‘బీజేపీ కొత్త సీరియల్ స్టార్ట్ చేసింది. దాని టైటిల్ ‘మంత్రి ఒకప్పటి గ్రాడ్యూయేటే’. ఇక్కడ విద్యార్హతలు మారతూ ఉండటమే కాక కొత్త రూపాన్ని సంతరించుకుంటాయి. కొత్త డిగ్రీ వస్తే.. పాతది పోతుంది. కొత్త కొత్త అఫిడవిట్లు తయారవుతుంటాయి’ అంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఈ వ్యాఖ్యలు స్మృతి ఇరానీ నటించిన ‘క్యోం కి సాస్ భీ కభీ బహు థీ’(అత్త ఒకప్పటి కోడలే) అనే సీరియల్‌ను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేసింది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు నడిచిన ఈ సీరియల్‌లో స్మృతి ఇరానీ లీడ్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే.
విద్యార్హతల విషయంపై విపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా.. స్మృతి మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. అవేవీ తన గెలుపును అడ్డుకోలేవని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కానీ తప్పుడు విద్యార్హతలు పొందుపర్చడం గురించి మాత్రం స్మృతి స్పందిలేదు.
Comments
Please login to add a commentAdd a comment