సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అధికార పార్టీ ఎక్కడ దుర్వినియోగానికి పాల్పడ్డా ఎదురించాలని సూచించింది. డబ్బు పంపిణీ నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రకటనల వరకు అన్ని అంశాలపై దృష్టి పెట్టాలని, ఎక్కడ ఉల్లంఘనలు జరిగినా పార్టీతో పాటు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లే బాధ్యత స్థానిక నాయకత్వానిదేనని తెలిపింది.
సోమవారం గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా అధ్యక్షతన టీపీసీసీ ముఖ్య నేతల అత్యవసర సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మల్లుభట్టి విక్రమార్క, మేనిఫెస్టో కమిటీ కో చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి, ఎంపీ నంది ఎల్లయ్య, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, పార్టీ ముఖ్య నేతలు గీతారెడ్డి, కోదండరెడ్డి, పద్మావతిరెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, గూడూరు నారాయణరెడ్డి, ఆకుల లలిత, సునీతాలక్ష్మారెడ్డి, బండా కార్తీకరెడ్డి, నేరెళ్ల శారద తదితరులు దీనికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎన్నికలకు పార్టీ సిద్ధం కావాల్సిన తీరు, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాల అమలుపై నేతలు చర్చించారు. అనంతరం కుంతియా, ఉత్తమ్‌లు మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు యథేచ్ఛగా పాల్పడుతున్నారని, ఈ ఉల్లంఘనలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చెప్పారు. ముఖ్యంగా రైతుబంధు, బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు లేకుండా చూసుకోవాలని సూచించారు.
పైసల పంపిణీని సహించొద్దు..
టీఆర్‌ఎస్ అభ్యర్థులకు కోట్ల రూపాయలున్నాయని, పైసల పంపిణీ ఎక్కడ జరిగినా అడ్డుకోవాలని కుంతియా, ఉత్తమ్ చెప్పారు. అలాగే రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రకటనల మీద కూడా ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో ఐదుగురు క్రియాశీల కార్యకర్తలను సిద్ధం చేయాలని, ఏఐసీసీ ఇచ్చిన పార్టీ కార్యాచరణను అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 2 నుంచి జన సంపర్క్ అభియాన్ పేరుతో నిర్వహిస్తోన్న ఇంటింటికీ ప్రచారాన్ని సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
ఆ ప్రాంతాల్లో అభ్యర్థులను ప్రకటించండి..
టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారు కావడంతో వారంతా ప్రజల్లోకి వెళ్తున్నారని.. విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసి ప్రజలను తమ వైపు తిప్పుకుంటున్నారని సమావేశంలో ఓ సీనియర్ మహిళా నాయకురాలు అభిప్రాయపడ్డారు. ఇబ్బందులు లేని నియోజకవర్గాల్లోనైనా పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తే వారి పని వారు చూసుకుంటారని చెప్పారు. వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై స్పందించిన కుంతియా ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని, త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పినట్టు సమాచారం. అలాగే తమకే టికెట్ కావాలని కోరుతూ జనాల్ని తీసుకుని ఎవరూ గాంధీభవన్‌కు రావొద్దని కూడా ఆయన సూచించారు. ‘అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ఓ దశ పూర్తయింది. షార్ట్‌లిస్ట్ అయిన ఆశావహులపై పార్టీ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే ఆధారంగా పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది’అని కుంతియా స్పష్టం చేశారు.
‘ఆ ప్రకటనలు కోడ్ ఉల్లంఘనే’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లో ఆపద్ధర్మ ముఖ్యమం త్రి, మంత్రులు, టీఆర్‌ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. అధికార పార్టీ రాష్ట్రాన్ని సొంత ఎస్టేట్‌గా వాడుకుంటోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు బలంరాంనాయక్, అం జన్‌కుమార్ యాదవ్, కోదండరెడ్డి, వినయ్‌లతో కలసి సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి రజత్ కుమార్‌ను కలసి అధికార పార్టీపై ఫిర్యాదు చేశారు.
ఈ నెల 6న శాసనసభ రద్దయిన మరుక్షణమే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింద న్నారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి ప్రచారం కల్పించే హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, ఆర్టీసీ బస్సులపై ప్రచార ప్రకటనలను కొనసాగించడం కోడ్ ఉల్లంఘనేనని తప్పుబట్టా రు. తక్షణమే వాటిని తొలగించాలన్నారు. తనకు ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేస్తే రూ.5 లక్షలు ఇస్తామని డ్వాక్రా మహిళలను ప్రలోభాలకు గురిచేసిన తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment