
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదవుల్లో ఉన్నవారే తెలంగాణ ఏర్పాటు కోసం త్యాగాలు చేశారా అని సీఎం కేసీఆర్‌ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ బుధవారం ఓ లేఖలో ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రమే ఉండాలంటూ ఉద్యమకారులను తరిమి కొట్టి, దాడులకు తెగబడిన మంత్రులు మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కడియం శ్రీహరి వంటివారే నిజమైన ఉద్యమకారులా అని ప్రశ్నించారు.
అధికార దాహం, పదవీవ్యామోహంతో తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల ఆత్మలను సీఎం అవమానిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తున్న ఉద్యమకారులను వేధిస్తున్నారని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో కూడా లేని నిర్బంధాన్ని, అప్రజాస్వామిక విధానాలను సీఎం అమలు చేస్తున్నారని శ్రవణ్ విమర్శించారు.