
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్‌రెడ్డి స్పష్టం చేశారు. సనత్‌నగర్ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయనకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు. అధిష్టానంతో సంప్రదింపుల అనంతరం ఆయన ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సనత్‌నగర్ టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అవసరమైతే సికింద్రాబాద్ టికెట్ టీడీపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే తాను మాత్రం సికింద్రాబాద్ నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని.. ఇదే విషయాన్ని అధిష్టానానికి తేల్చి చెప్పానని వివరించారు. కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని.. సనత్‌నగర్ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచన లేదన్నారు. అయితే సనత్‌నగర్ టికెట్‌పై కాంగ్రెస్ అధిష్టానం మర్రికి హామీ ఇచ్చిందా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు.