
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ నాయకులపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎలక్షన్ కోడ్‌ను ఉల్లఘించారని ఆరోపించారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. అక్టోబర్ 3వ తేదీన సిరిసిల్లలో జరిగిన చేనేత కార్మికుల సభలో ఇన్సూరెన్స్ ఇస్తామనని కేటీఆర్ ప్రకటించారు. గజ్వెల్‌లో హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముదిరాజుల, యాదవుల సభలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ ముమ్మాటికీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలే. బ్రాహ్మణ సంఘం సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పాల్గొన్నారు. ఎన్నికల సభల్లో పాల్గొన్న ప్రభుత్వాధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై ఈసీ విచారించాలి
అక్టోబర్ 28న ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేశారు. రాజకీయాల కోసమే కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేశారని శశిధర్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ ధనాన్ని వాడుకుని చేసిన ఈ పర్యటనపై ఈసీ సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు. రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు అడుగడుగునా జరుగుతున్నాయనీ, వీటన్నిటిపై సీఈఓ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు.