
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్న నేపథ్యంలో ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ నడుస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రాకను కొందరు నేతలు బాహాటంగానే స్వాగతిస్తున్నా.. మెజారిటీ టీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. నిశితంగా పరిణామాలను గమనిస్తున్నారు.
ఒకవైపు కాంగ్రెస్ హైకమాండ్‌తో మంతనాలు సాగిస్తున్న రేవంత్ అదే సమయంలో పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతోనూ టచ్‌లో ఉన్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలను ఆయన కలిసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా తన రాకను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలపై రేవంత్ ఫోకస్ చేసినట్టు వినిపిస్తోంది.
మరోవైపు తన వెంట భారీగా టీ టీడీపీ నేతలను కాంగ్రెస్ గూటికి తీసుకెళ్లాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ టీడీపీలోని ఎక్కువమంది నేతలను సమీకరించేందుకు ఆయన స్కెచ్ వేసినట్టు సమాచారం. తన అనుకూల నేతలు, సన్నిహితులతో రేవంత్ నిత్యం మంతనాలు జరుపుతూ.. తన వెంట కలిసిరావాల్సిందిగా కోరుతున్నారని సమాచారం. కేసీఆర్ వ్యతిరేకులంతా ఒక్కతాటిపైకి రావాలని, తన వెంట నడువాలని రేవంత్ సూచిస్తున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్‌లో కాక!
రేవంత్‌రెడ్డి రాక కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతున్నట్టు కనిపిస్తోంది. రేవంత్‌రెడ్డి ఒకవేళ పార్టీలో చేరితే.. ఆయనకు అధిక ప్రాధాన్యమివ్వొద్దని, ఎన్నికల ప్రచారం వంటి కీలక బాధ్యతలు అప్పగించవద్దని టీపీసీసీలోని సీనియర్ నేతలు ఇప్పటినుంచే ఒత్తిడి తెస్తున్నట్టు వినిపిస్తోంది. రేవంత్ బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ఆయన ఎలాంటి ముందస్తు షరతులు పెట్టడం లేదని కుంతియా ఓవైపు బుజ్జగిస్తున్నా.. పార్టీ నేతలు మాత్రం ఈ విషయంలో కొంత నిశితంగానే దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.
నో కామెంట్!
రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న కథనాలపై స్పందించాలని కోరగా.. ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోకామెంట్ అంటూ సమాధానం దాటవేశారు. రేవంత్ విషయాన్ని తనతో ఎవరూ చర్చించలేదని అన్నారు. ఇటీవలి కురిసిన వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పత్తి, వరికి మద్దతు ధర రావడంలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న రెండులక్షల మంది రైతులతో 'ఛలో అసెంబ్లీ' నిర్వహిస్తామని తెలిపారు.