సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించే కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే టీఆర్‌ఎస్ 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు సవాలు విసరడంతో.. కాంగ్రెస్ కూడా వేగంగా పావులు కదుపుతోంది. కానీ కాంగ్రెస్‌లో ఆశావహుల జాబితా ఎక్కువగా ఉండటం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పర్యటిస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్య సభలో విపక్షనేత గులాంనబీ ఆజాద్‌ను గురువారం గాంధీభవన్ వద్ద ఆశావహులు చుట్టుముట్టారు. ఈ సందర్బంగా వారిని ఉద్దేశించి మాట్లాడిన ఆజాద్.. టికెట్ల విషయం తర్వాత అని.. ముందు పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. ఇంత ముందుగా టికెట్లు ఇవ్వడం కుదరదని అన్నారు. టికెట్‌ల కోసం గాంధీభవన్ చుట్టూ తిరగటం కాదని.. నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేయాలని హితవు పలికారు. సీనియర్లు అయి, పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తే.. పార్టీనే పనితీరు గుర్తించి టికెట్లు ఇస్తుందని తెలిపారు. ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అంతకు ముందు పార్క్ హయత్‌లో బస చేసిన ఆజాద్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు భేటీ అయ్యారు. బుధవారం ప్రకటించిన ప్రచార కమిటీ జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ప్రచార కమిటీ చైర్మన్ వస్తుందని ఆశించానని వీహెచ్ తెలిపారు. 1989లో ప్రచార కమిటీ చైర్మన్‌గా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన సమర్ధుడినని అన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కోవర్టులున్నారని.. తనకు పదవి ఇస్తే కేసీఆర్‌ను ఓడిస్తానని కోవర్టులు భయపడుతున్నారని ఆరోపించారు. కోవర్టులే తనకు పదవి రాకుండా చేశారని విమర్శించిన ఆయన.. త్వరలో వారి పేర్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌కు చెబుతానని అన్నారు. కాగా నిన్న ప్రకటించిన కమిటీల్లో.. పార్టీ వ్యూహరచన, ప్రణాళిక రూపకల్పన కమిటీ చైర్మన్ బాధ్యతలను వీహెచ్‌కు అప్పగించారు
మరోవైపు టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో కలిసి మహా కూటమిగా ఎన్నికల బరిలో దిగాలని చూస్తున్న కాంగ్రెస్ పొత్తుల తర్వాతే టికెట్ల కేటాయింపు ఉంటుందని తెలిపింది. ఇప్పటికే కాంగ్రెస్‌లో టికెట్లు ఆశిస్తున్న కొందరు నేతలు కూటమి వల్ల తమకు టికెట్ దక్కకుండా పోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment