
సాక్షి, నెల్లూరు రూరల్: ప్రజల్లో అసంతృప్తిని చల్లార్చడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతూ.. విభజించు..పాలించు విధానంలో పాలన సాగిస్తోందని ఆలిండియా డీవైఎఫ్‌ఐ (డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) మాజీ ప్రధాన కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ ఎంపీ మహ్మద్ సలీం ఆరోపించారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు ఆదివారం నెల్లూరులో ప్రారంభమయ్యాయి. తొలుత నెల్లూరు నగరంలో వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నర్తకి సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, 16 లక్షల కోట్ల నల్లధనాన్ని వెలికితీసి పేదల అకౌంట్లలో వేస్తామనే హామీలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. మూడున్నరేళ్లు అయినా ఇప్పటికీ ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. నిరుద్యోగం పెరగడానికి బీజేపీ అవలంబిస్తోన్న ఆర్థిక విధానాలే కారణమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు మోసం చేసిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్.. సంఘ్‌పరివార్‌కు త్రిశూలాలు, కరవాలాలు అందజేసి భయానక వాతావరణం కల్పిస్తోందని చెప్పారు. వామపక్షవాదులుగా బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకుంటామని తెలిపారు. ఈ సభలో డీవైఎఫ్‌ఐ ఆలిండియా అధ్యక్షుడు మహమ్మద్ రియాజ్, ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, యండ్లపల్లి శ్రీనివాసులురెడ్డి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు పాల్గొన్నారు.