
ముంబై : రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబై ప్రాంతంలో సీట్ల సర్దుబాటును కాంగ్రెస్, ఎన్సీపీలు ఖరారు చేశాయి. ఒప్పందం ప్రకారం ముంబై ప్రాంతంలోని 36 అసెంబ్లీ స్ధానాలకు గాను కాంగ్రెస్ 25 సీట్లలో పోటీ చేయనుండగా, ఎన్సీపీ ఏడు స్ధానాల్లో తన అభ్యర్ధులను నిలపనుంది. ఈ కూటమిలో మరో భాగస్వామ్య పార్టీ ఎస్పీ ఒక స్ధానంలో పోటీకి దిగనుంది. మరో మూడు స్ధానాలను కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించాలని ప్రాధమికంగా నిర్ధారించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.
కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య సీట్ల సర్ధుబాటుపై జరిగిన భేటీలో సీనియర్ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, మల్లిఖార్జున్ ఖర్గే, బాలాసాహెబ్ థొరాట్, ఏక్‌నాథ్ గైక్వాడ్ తదితరులు పాల్గొన్నారు, ముంబై సహా మహారాష్ట్రలో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్ధుల తుది జాబితాను ఈనెల 14న ప్రకటిస్తారని భావిస్తున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ చీఫ్‌లు సోనియా గాంధీ, శరద్ పవార్‌ల మధ్య ఢిల్లీలో జరిగిన భేటీ అనంతరం ఇరు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు ప్రక్రియ వేగవంతమైంది.