
సాక్షి, హైదరాబాద్: ఓట్లపరంగా సగమున్నా.. సీట్ల కోసం పాట్లు తప్పడంలేదు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎంతమంది మహిళలకు టికెట్లు లభిస్తాయన్న దానిపై స్పష్టతలేదు. కాంగ్రెస్ కనీసం పోటీ చేయనున్న తొంబై ఐదు స్థానాల్లో మహిళలకు పదిహేను స్థానాలు కేటాయించాలన్న డిమాండ్ ఉంది. అయితే, అధిష్టానం ఏ మేరకు కనికరిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో మొత్తంగా 2.73 కోట్ల మంది ఓటర్లుండగా ఇందులో మహిళాఓటర్లు 1.35 లక్షల మంది ఉన్నారు.
ఈ నేపథ్యంలో మహిళలకు 33 శాతం టికెట్లు కేటాయించాలన్న డిమాండ్ ఉన్నా దాన్ని ఏ పార్టీ పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. 119 స్థానాలకుగానూ 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్ అందులో నలుగురు సిట్టింగ్ మహిళాఅభ్యర్థులకు మాత్రమే టికెట్లు కేటాయించింది. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే బొడిగె శోభ విషయంలో నిర్ణయం తీసుకోలేదు. మిగిలిన 14 స్థానాల్లోనూ మరో ఇద్దరు, ముగ్గురికి మించి మహిళలుండే అవకాశం లేదు. దీంతో కాంగ్రెస్‌లో మహిళలకు ఎక్కువ టికెట్లు ఇవ్వడం ద్వారా మహిళాఓటర్లను తమ వైపునకు తిప్పుకోవాలని కాంగ్రెస్ అధిష్టానానికి మహిళానేతలు విన్నవించుకుంటు న్నారు.
ఆశావహులు ఎవరంటే...
సిట్టింగ్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, డీకే అరుణ, పద్మావతిలకు టికెట్లు దాదాపు ఖరారు కానున్నాయి. వీరితోపాటు మాజీ మంత్రులైన సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, కొండా సురేఖతోపాటు సీతక్కకు టికెట్లు దక్కడం ఖాయమే. వీటిని మినహాయిస్తే మరెక్కడా మహిళాసీట్ల కేటాయింపుపై స్పష్టత లేదు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నా ఎక్కడి నుంచి అన్నది తేలలేదు. ఎమ్మెల్సీ ఆకుల లలిత ఆర్మూర్ స్థానాన్ని ఆశిస్తుండగా, అది పొత్తుల్లో టీడీపీకి వెళుతుందా? లేక కాంగ్రెస్ నుంచి వేరే అభ్యర్థి ఎవరైనా బరిలో ఉంటారా.. అన్నది తేలాల్సి ఉంది. జుక్కల్ నుంచి మాజీ ఎమ్మెల్యే అరుణతార టికెట్ ఆశిస్తుండగా, మాజీ ఎమ్మెల్యే గంగారాం కూడా టికెట్ కోసం అధిష్టాన పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.
మాల సామాజిక వర్గం నుంచి గీతారెడ్డి కీలకనేతగా ఉన్నారని, మాదిగ సామాజిక వర్గం నుంచి మహిళలు ఎవరూ లేనందున తనకు టికెట్ ఇవ్వాలని అరుణతార కాంగ్రెస్ పెద్దలను కోరుతున్నారు. రాష్ట్ర మహిళాకాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద కరీంనగర్ టికెట్ కోరుతుండగా, ఇక్కడ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నుంచి గట్టి పోటీ నెలకొంది. సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి పేరు వినిపిస్తున్నా, పొత్తుల్లో భాగంగా అది టీడీపీకి వెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం నుంచి మాజీ ఎంపీ రేణుకాచౌదరి, ఆదిలాబాద్ నుంచి జి.సుజాత, ఇల్లందు నుంచి హరిప్రియ, ఎల్లారెడ్డి నుంచి జమునా రాథోడ్ టికెట్లకై పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పది టికెట్లు కూడా మహిళలకు దక్కకపోవచ్చనే అభిప్రాయాన్ని గాంధీభవన్ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment