
సాక్షి, న్యూఢిల్లీ: కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్ల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ నివాసంలో శనివారం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. కర్ణాటక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల జాబితాపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ భేటీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు కీలక నేతలు హాజరయ్యారు. కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య విభేదాల కారణంగా ఆ పార్టీ అభ్యర్థుల జాబితా ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన ప్రకారం 180మంది అభ్యర్థులతో తొలి జాబితాను శుక్రవారం విడుదల చేయాల్సి ఉంది. అయితే, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అధ్యక్షతన రెండుసార్లు సమావేశమైనప్పటికీ అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయం సాధ్యం కాలేదని, శనివారం మరోసారి భేటీ కానున్నామని సీఎం సిద్దరామయ్య ఇప్పటికే తెలిపారు.
పార్టీ సీనియర్ నేతలంతా ఎవరికి వారు సొంత జాబితా తయారుచేసుకొని రావడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన జేడీఎస్, బీజేపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నట్టు సమాచారం. సీఎం సిద్దరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేశ్వర, కొందరు సీనియర్ మంత్రుల కుటుంబసభ్యులకు టికెట్లు ఇస్తుండటంపైనా కాంగ్రెస్‌లో విభేదాలు భగ్గమంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment