సాక్షి, హైదరాబాద్: ‘మహాకూటమి’ఏర్పాటుకు లైన్‌క్లియర్ అయింది. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమి, కేసీఆర్‌ను గద్దెదింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా మరో అడుగు పడింది. రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా కలసి పనిచేయాలని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ నిర్ణయించాయి. ఈ మేరకు మంగళవారం పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన మూడు పార్టీల సమావేశంలో అంగీకారం కుదిరింది. కాంగ్రెస్ నుంచి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, గూడూరు నారాయణరెడ్డి, టీడీపీ నుంచి ఎల్.రమణ, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు ఈ సమావేశానికి హాజరై ఎన్నికల పొత్తుల గురించి చర్చించారు.
రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని, అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని కేసీఆర్ సాగిస్తున్న అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలంటే భావసారూప్యం ఉన్న పార్టీలూ కలసి పనిచేయాల్సిందేనని నేతలు అభిప్రాయపడ్డారు. సబ్బండ వర్ణాల ఆకాంక్షలను ఫణంగా పెట్టి కేసీఆర్ సాగించిన పాలన అన్ని వర్గాల్లో అసంతృప్తిని మిగిల్చిందని, ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా అబద్ధాలతో అరాచక పాలన సాగించారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ను గద్దెదింపాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడిగా ముందుకెళ్లాలని, కలసి వచ్చే అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో చర్చలు జరిపి కూటమిలో చేర్చుకోవాలని నిర్ణయించారు.
పొత్తు ప్రాతిపదికలపై చర్చ...
మూడు పార్టీల నేతల సమావేశంలో భాగంగా మహాకూటమిలోకి వచ్చే పార్టీల మధ్య పొత్తు కుదుర్చుకోవాల్సిన ప్రాతిపదికలపై చర్చించారు. ఎక్కడా భేషజాలకు పోకుండా సమన్వయంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేది ముఖ్యం కాదని, గెలిచే స్థానాల్లో పోటీచే యడంపైనే దృష్టి పెట్టి కసరత్తు చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. అన్ని పార్టీలు, ప్రజాసంఘాలతో చర్చలు పూర్తయి విశాల వేదిక ఏర్పాటయిన తర్వాతే సీట్ల పంపకాలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. కూటమి ఏర్పాటు చేసిన అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించి ప్రజల్లోకి వెళ్లాలని, ఆ సభ నుంచే ఎన్నికల శంఖారావం పూరించాలని నేతలు అభిప్రాయపడ్డారు.
యూపీఏ తరహాలో..
ఈసారి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయి ఫార్ములాతో మహాకూటమి ముందుకెళ్లనుంది. 2004 సార్వత్రిక ఎన్నికల అనంతరం యూపీఏ భాగస్వామ్య పక్షాల తరఫున ‘కనీస ఉమ్మడి ప్రణాళిక’ తయారు చేయగా, ఈసారి ఎన్నికలకు ముందే రాష్ట్రంలోని మహాకూటమి పక్షాన ఈ కనీస ఉమ్మడి ప్రణాళికను ప్రజల ముందుపెట్టాలని నిర్ణయించారు. కూటమిలోని అన్ని పక్షాలు తమ తమ పార్టీల మేనిఫెస్టోలను ప్రజల ముందు పెట్టాలని, వాటిల్లోని ప్రధాన అంశాలతో కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రూపొందించాలని నిర్ణయించారు. ఈ కనీస ఉమ్మడి ప్రణాళిక ద్వారా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపై ప్రజల్లో భరోసా కల్పించాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఉద్యమ సందర్భంలో కేసీఆర్ చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చాక ఎలా ఉల్లంఘించారో ఎత్తిచూపాలని నిర్ణయించారు.
టీజేఎస్, సీపీఎంలతోనూ చర్చలు...
కూటమిలోకి ఈ మూడు పార్టీలతో పాటు తెలంగాణ జన సమితి, సీపీఎంను కూడా ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా మూడు పార్టీలతో కలసి మాట్లాడేందుకు సమయమివ్వాలని కోరుతూ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంకు ఫోన్ చేశారు. ఈ నేపథ్యంలో నేడు టీజేఎస్‌తో మూడు పార్టీల నేతలు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీపీఎం కూడా కూటమిలో భాగస్వామి కావాలని అభిప్రాయపడ్డ నేతలు ఆ పార్టీ కేంద్ర కమిటీతో కూడా సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు.
కేసీఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యం: ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
‘రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గపు పాలన చేస్తున్నారు. కేసీఆర్‌ను గద్దె దింపడం కోసం అన్ని ప్రతిపక్షాలను కలుపుకుని ఎన్నికలకు వెళ్తాం. ఇది మొదటి సమావేశం మాత్రమే. భవిష్యత్తులో అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ, నిరుద్యోగ, మహిళ సంఘాలతో కలసి చర్చిస్తాం. వారిని కూడా కలుపుకుని ఎన్నికలకు వెళ్తాం.’
ప్రజల కోసమే ప్రతిపక్షలన్నీ కలుస్తున్నాయి: ఎల్.రమణ
‘రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ ఆదరబాదరగా రద్దు చేశారు. దేశంలో ఆదర్శంగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో చర్చలు జరపకుండా నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, లెఫ్ట్ పార్టీలు కలసి మహా కూటమిగా ముందుకెళతాం. రాష్ట్ర ప్రజల కోసమే ప్రతిపక్షాలన్నీ కలుస్తున్నాం.’
అందరం కలిసే ముందుకు..: చాడ వెంకటరెడ్డి
‘కేసీఆర్ ప్రజాస్వామ్య విలువలను మట్టిలో కలిపారు. పార్టీ పిరాయింపులను ప్రోత్సహించి విలువలను తుంగలో తొక్కారు. ప్రతిపక్ష పార్టీలందరం కలసి ఎన్నికలకు వెళ్తాం. కేసీఆర్‌ని గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తాం.’
Comments
Please login to add a commentAdd a comment